ఐటీ బతుకు బెంబేలు.. ఉద్యోగుల్లో కోత.. కొత్తవాటికి వాత!
టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ సంస్థలు తాజాగా ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ఎలాంటి వృద్ధినీ కనబరచకపోగా
By: Tupaki Desk | 13 Oct 2023 11:30 PM GMTఐటీ ఉద్యోగం అంటే వైట్ కాలర్ జాబ్. చేతి నిండా డబ్బులు.. వారానికి ఐదు రోజులు మాత్రమే పని. పైగా విస్తృతమైన అవకాశా లు ఉన్న రంగం కూడా. దీంతో బీటెక్, ఎంటెక్ చేసిన వారంతా.. ఐటీ దిశగా అడుగులు వేయడం పరిపాటిగా మారిపోయింది. టెక్ సంస్థల్లో ఉద్యోగం వస్తే.. జీవితమే మారిపోతుందనే మాట కూడా నిజమే. అయితే.. ఇది ఒకప్పటి మాట. కరోనా అనంతర పరిణామాలు కావొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న సంఘర్షణలు, వివాదాలు.. ఆర్థిక మాద్యం, ద్రవ్యోల్బణం వంటి కారణాలు కావొచ్చు.. ఏదేమైనా..ఇ ప్పుడు ఐటీ రంగం చివురుటాకు మాదిరిగా వణుకుతోంది.
కొత్త ఉద్యోగాల కల్పనలో, భారీ వేతనాలు ఇవ్వడంలో ఒకప్పుడు ముందున్న ప్రఖ్యాత ఐటీ సంస్థలు.. ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయాయి. టీసీఎస్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఇప్పుడు ప్రమాదపు టంచుల్లోకి వెళ్లిపోయాయి. ఉన్న ఉద్యోగుల్లో కోత పెట్టడంతోపాటు.. కొత్త నియామకాల ఊసే ఎత్తడం లేదు.
దీంతో ఐటీ బతుకు బెంబేలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ సంస్థలు తాజాగా ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ఎలాంటి వృద్ధినీ కనబరచకపోగా.. ఆందోళనకర పరిస్థితిలో ఉన్నట్టు స్పష్టంగా తెలిసిపోయింది.
ఆయా సంస్థల లాభాలు, ఆదాయాలు బాగానే ఉన్నప్పటికీ.. ఉద్యోగుల(హెడ్ కౌంట్) సంఖ్య విషయంలో మాత్రం గణనీయంగా ఆయా సంస్థలు తమ అంచనాలను తగ్గంచేయడం ఆందోళన కలిగిస్తోంది. అదేసమయంలో కొత్త ఉద్యోగాల కల్పన ఊసే లేకుండా పోవడంతో టెకీలుగా మారాలని కలలు గంటున్న వందల మందికి మరింత ఆందోళన కలిగిస్తోంది. సంస్థల వారీగా చూసుకున్నా.. పరిస్థితి ఇలానే ఉండడం గమనార్హం. ఈ పరిస్థితిని గమనిస్తున్న వారు.. ఐటీ వైపు చూడకపోవడమే మంచిదని.. ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకోవడమే బెటర్ అని చెబుతున్నారు.
ఏ సంస్థ ఎలా ఉంది?
+ టీసీఎస్ మూడు మాసాల పనితీరు ఆధారంగా వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఈ సంఖ్య 6,333గా ఉంది.
+ టీసీఎస్‌లో ఏప్రిల్ - జూన్ వరకు 6,15,318 మంది ఉద్యోగులు ఉండగా, జూలై-సెప్టెంబరు నాటికి ఈ సంఖ్య 6,08,985కు తగ్గింది. అంటే.. మొత్తంగా 6,333 మంది ఉద్యోగులను తొలగించారు.
+ ఇన్ఫోసిస్‌లోనూ ఉద్యోగుల కోత భారీగా ఉంది. 7530 మంది ఉద్యోగులను ఈ సంస్థ ఇంటికి పంపించింది.
+ పైగా క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను చేపట్టేది లేదని ఇన్ఫోసిస్ ప్రకటించడం గమనార్హం.
+ హెచ్‌సీఎల్ టెక్ సంస్థలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మొత్తంగా ఆరు మాసాల వ్యవధిలో 4800 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. అయితే.. కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటామని మాత్రమే ప్రకటించింది.