ఉద్యోగాల తొలగింపు.. ఈ ఏడాది ఈ స్థాయిలోనా?
తాజాగా స్నాప్ ఇంక్ కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540 మంది) తగ్గించినట్లు బాంబుపేల్చింది.
By: Tupaki Desk | 6 Feb 2024 6:17 AM GMTకోవిడ్ సంక్షోభ తదనంతర పరిస్థితులు, రష్యా–ఉక్రెయన్ వార్, ఇజ్రాయల్– హమాస్ యుద్ధం, ఆర్థిక సంక్షోభం వంటివాటితో ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది కూడా భారీగా ఉద్యోగాల తొలగింపులు (లేఆఫ్స్) చోటు చేసుకుంటున్నాయి.
ఈ ఏడాది (2024)లో ఇంకా రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. కానీ ఇప్పటివరకు ఏకంగా 32 వేల మంది టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. దీన్ని బట్టి ఈ ఏడాది కూడా భారీగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని తెలుస్తోంది. ఈ విషయాన్ని లేఆఫ్స్.ఎఫ్‌వైఐ వెల్లడించింది.
తాజాగా స్నాప్ ఇంక్ కంపెనీ 10 శాతం మంది ఉద్యోగులను (540 మంది) తగ్గించినట్లు బాంబుపేల్చింది. దీనితో పాటు ఒక్టా ఇంక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడానికి సిబ్బందిలో ఏకంగా 7 శాతం మంది ఉద్యోగులను (400 మంది) తొలగించింది.
ఇక ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలైన అమెజాన్, సేల్స్ ఫోర్స్, మెటా వంటివి సైతం 2024లో ప్రారంభం నుంచే ఉద్యోగుల్లో కోతలు వేస్తూనే ఉన్నాయి. అయితే ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకోవడం మాత్రమే కాదని తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రవేశంతో మానవ వనరుల అవసరం భారీగా తగ్గడమే ఉద్యోగుల తొలగింపుకు కారణమని అంటున్నారు. తమ కంపెనీల్లో ఆధునికత సాంకేతికతను ప్రవేశపెట్టే క్రమంలో ఉద్యోగులు అవసరం లేని చోట వారిని కంపెనీలు తొలగిస్తున్నాయి.
ప్రస్తుతం చాలా కంపెనీలు 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (ఏఐ) ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. దీంతో కొత్త నియామకాల సంఖ్యను తగ్గించేశాయి. అంతేకాకుండా ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
మరోవైపు ఉద్యోగాల తొలగింపుతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోపాటు ప్రస్తుతం జాబ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న అంశాలపై పట్టు ఉన్నవారికి అపార అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీతోపాటు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర అంశాలపై పట్టున్నవారికి కంపెనీలు ఉద్యోగాలు ఇస్తున్నాయని అంటున్నారు. వీటికి డిమాండ్ అధికంగా ఉందని చెబుతున్నారు.
జాబ్ మార్కెట్ లో డిమాండ్ ఉన్న అంశాలకు సంబంధించి గత డిసెంబర్ నుంచి జనవరి వరకు పలు కంపెనీలు 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. దీంతో ఏఐ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల సంఖ్య 17,479కి చేరినట్లు సమాచారం.