Begin typing your search above and press return to search.

లంచాలకు ఉద్యోగాలు..టీసీఎస్‌ 16 మంది ఉద్యోగులపై వేటేసింది!

ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టీసీఎస్‌ తాజాగా 16 మంది ఉద్యోగులపై వేటేసింది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 9:22 AM
లంచాలకు ఉద్యోగాలు..టీసీఎస్‌ 16 మంది ఉద్యోగులపై వేటేసింది!
X

దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటి.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌). ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టీసీఎస్‌ తాజాగా 16 మంది ఉద్యోగులపై వేటేసింది. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడంలో ఈ 16 మంది పాత్ర ఉందని నిర్ధారించిన టీసీఎస్‌ వారందరినీ తొలగించింది. అలాగే వీరితోపాటు కంపెనీతో వ్యాపారం చేస్తున్న ఆరుగురు విక్రేతలపైన నిషేధం విధించింది. ఈ మేరకు ఈ వివరాలను టీసీఎస్‌.. స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు అందజేసింది.

కాగా ఈ కుంభకోణంలో మొత్తం 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు టీసీఎస్‌ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే వీరిలో 16 మందిపై వేటేయగా మరో ముగ్గురిని ‘రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌’ విధుల నుంచి తప్పించి వేరే విభాగానికి బదిలీ చేసింది. అలాగే ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకుండా వారిపై నిషేధం విధించింది.

విక్రేతలతో కలిసి కొంత మంది ఉద్యోగులు టీసీఎస్‌ లో కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌ లో ఆరోపణలు వచ్చాయి. కొత్త ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఉద్యోగులకు భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్లు వెల్లడైంది. కంపెనీకి చెందిన ఒక వేగు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ విషయం బయటకు పొక్కింది.

దీంతో లోతైన విచారణకు టీసీఎస్‌ ఒక కమిటీని నియమించింది. అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల పాటు దర్యాప్తు జరిపిన కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది. దాని ఆధారంగానే టీసీఎస్‌ 16 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

కాగా లంచాలకు ఉద్యోగాల కుంభకోణంలో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని టీసీఎస్‌ నిర్ధారించింది. ఈ కుంభకోణంతో కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అలాగే ఆర్థికంగానూ ఎలాంటి నష్టం వాటిల్లలేదని వెల్లడించింది.

భవిష్యత్‌ లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని టీసీఎస్‌ పేర్కొంది. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా ఎప్పటికప్పుడు పాలనా విధానాల్లో మార్పులు చేస్తామని తెలిపింది. ఉద్యోగులు సహా కంపెనీతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరూ కంపెనీ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.

కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై–సెప్టెంబరులో టీసీఎస్‌ రూ.11,342 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022–23 ఇదే త్రైమాసిక లాభం రూ.10,431 కోట్లతో పోలిస్తే ఇది 8.7 శాతం అధికం కావడం విశేషం.

మరోవైపు కంపెనీలో పనిచేస్తున్న 6 లక్షల మంది ఉద్యోగులను పూర్తి స్థాయిలో కంపెనీకి వచ్చి పనిచేయాలని టీసీఎస్‌ ఆదేశాలు జారీ చేసింది. ఇక వర్క్‌ ప్రమ్‌ హోంకు స్వస్తి పలికినట్టు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది తాజా ఉత్తీర్ణులను నియమించుకుంటామని ప్రకటించింది.