గంటకు 23 మంది టపాటపా ఇంటిముఖం.. ఏం జరిగింది?
ఈ ఆర్థిక సంవత్సరం ఆరు మాసాల్లో (ఏప్రిల్-సెప్టెంబరు) గంటకు 23 మంది చొప్పున టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు సర్వేలో స్పష్టంగా తెలిసింది.
By: Tupaki Desk | 19 Oct 2023 3:06 PM GMTచేతినిండా డబ్బు వస్తుందని.. వారానికి ఐదు రోజులే పనిచేసుకునే వెసులు బాటు ఉంటుందని ఎన్నో ఆశలతో ఐటీ ఉద్యోగాలు సాధిస్తున్న యువతకు.. సదరు కంపెనీలు ఇటీవల కాలంలో భారీ ఎత్తున షాకిస్తున్నాయి. ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక.. తిరిగి రేపు ఉదయం ఆఫీసుకువెళ్లోలోగా.. ఏం జరుగుతుందో.. తమ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని.. టెకీలు ఉద్యోగ భద్రతలేని రాత్రుళ్లు గడుపుతున్నారు.
తాజాగా టెకీల పనితీరు, వారి ఉద్యోగ భద్రత, వారికి ఎదురవుతున్న సమస్యలు వంటి కీలక విషయాలపై లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్‌సైట్ ఓ సర్వే చేసింది. ఈ సర్వేలో సంచలన విషయాలు నమోదయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆరు మాసాల్లో (ఏప్రిల్-సెప్టెంబరు) గంటకు 23 మంది చొప్పున టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయినట్టు సర్వేలో స్పష్టంగా తెలిసింది.
ముఖ్యంగా 'లింక్డ్ ఇన్' సంస్థ అయితే.. భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత పెట్టినట్టు లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్‌సైట్ సంస్థ వెల్లడించింది. ఇటీవల లింక్డ్‌ఇన్ 668 మంది ఉద్యోగులను తొలగించినట్టు పేర్కొంది. ఈ సంస్థ తొలగించిన వారిలో ఇంజనీరింగ్, ప్రొడక్ట్, టాలెంట్, ఫైనాన్స్ టీమ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే.. దీనికి కారణం లింక్డ్ ఇన్ కంపెనీ ఆదాయాలు పెరగకపోవడమేనని లేఆఫ్.ఫీ (layoff.fyi) వెబ్‌సైట్ పేర్కొంది.
ఈ ఒక్క సంస్థే కాదు.. ప్రతిష్టాత్మక ఇన్పోసిస్ కూడా ఈ జాబితాలోనే ఉందని సర్వే సంస్థ వెల్లడించింది. ఈ పరిణామాలను లోతుగా గమనిస్తే.. సగటున ప్రతి గంటకు 23 మంది టెక్కీలు ఉద్యోగాలు కోల్పోతున్నట్లు సర్వే సంస్థ వివరించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఐటీ దెబ్బ ఇదీ..
+ 2022లో 1,061 టెక్ కంపెనీలు 164,769 మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి.
+ 2023లో ఇప్పటి వరకు 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగులను తొలగించాయి.