పెద్ద అంకె మోడీకి ఇబ్బంది పెడుతుందా ?
దేశంలో తిరుగులేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. అంతే కాదు బీజేపీలోనూ ఆయన స్థానం చెక్కుచెదరనిది.
By: Tupaki Desk | 1 April 2025 6:30 AMదేశంలో తిరుగులేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. అంతే కాదు బీజేపీలోనూ ఆయన స్థానం చెక్కుచెదరనిది. ఆయనే కాషాయం పార్టీకి అన్నీ అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎంతవారు అయినా కాలానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందే. ఇపుడు అదే కాలం మోడీ వైపు ఏ విధంగా చూస్తోంది అన్నదే ఒక చర్చగా ఉంది.
నరేంద్ర మోడీ 2014లో ఈ దేశానికి తొలిసారి ప్రధాని అయ్యారు. ఆయన ప్రధాని అయ్యేనాటికి వయసు 63 ఏళ్ళు మాత్రమే. అంటే రాజకీయంగా ఆయన మంచి వయసులో ఉన్నట్లు లెక్క. అప్పటికి బీజేపీలో సీనియర్లుగా ఉన్న ఎల్ కే అద్వానీ. మురళీ మనోహర్ జోషీ వంటి వారు ఎనభైలు దాటేశారు.
వారే కాదు ఇంకా వరిష్ట నేతలు అనేకమంది ఉన్నారు. జాతీయ రాజకీయ తెర మీద మోడీ నాటికి జూనియర్. ఆయన చుట్టూ కానీ పార్టీలోనూ ప్రభుత్వంలో కానీ ఎంతో మంది సీనియర్లే కనిపించేవారు. వారు జాతీయ రాజకీయాల్లో విశేష అనుభవం కలిగి ఉన్న వారు. దాంతో వారిని తప్పనిసరిగా గౌరవించి సమాదరించాల్సిన పరిస్థితి ఉండేది. ఇక 2014లో బీజేపీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి రాగానే సీనియర్ మోస్ట్ నేత అద్వానీయే ప్రధాని అవుతారు అని అంతా అనుకున్నారు.
ఆ విధంగానే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. ఎందుకంటే రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీని రెండు సార్లు అధికారంలోకి తేవడంతో అద్వానీ కృషి నిరుపమానం. ఆయన చేసిన సేవలకు గానూ చిరకాల కోరిక అయిన ప్రధాని పదవిని ఆయనకు అప్పగించడమే సముచితం అని కొంతమంది భావించారు ఐ అంటారు. కానీ జరిగింది వేరు. ఆయన శిష్యుడు మోడీ ప్రధాని అయ్యారు. ఇక రాష్ట్రపతి పదవి అయినా ఆయనకు దక్కుతుంది అంటే అది కూడా కాకుండా పోయింది.
దాంతో అద్వానీ రాజకీయాలకు దూరం అనేశారు. 2014 నుంచి 2019 దాకా లోక్ సభ సభ్యుడిగా ఉన్న అద్వానీ అలాగే మురళీ మనోహర్ జోషీ వంటి వారు తామే హుందాగా తప్పుకున్నారు. అయితే మిగిలిన సీనియర్ల కోసం పార్టీ ఒక విధానం రూపొందించింది. అదే 75 ఏళ్ళు దాటిన వారికి పార్టీ ప్రభుత్వ పదవులు ఏవీ దక్కవని. వారు ఎన్నికల రాజకీయాల నుంచి దూరం కావాల్సిందే అని.
ఆనాటికి అది ఎంతో బాగుంది. చాలా సులువుగా కూడా అమలు చేయగలిగారు. ఎందుకంటే మోడీకి అపుడు 63 ఏళ్ళు మాత్రమే. ఇక చూస్తే కనుక ఆనాడు ఎంతో మంది లబ్దప్రతిష్టులు అయిన వారు అంతా ఈ నిబంధనల వల్ల తెర వెనక్కు పోయారు. మోడీతో సఖ్యత నెరిపిన సీనియర్లు మాత్రమే పార్టీలో ప్రభుత్వంలో కనిపించారు అని అంటారు. కానీ కాలం ఆగదు కదా చూస్తూండగానే పుష్కర కాలం గడచిపోయింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి నరేంద్ర మోడీకి అక్షరాలా 75 ఏళ్ళు నిండిపోతాయి. ఆయన 76వ ఏటకు అడుగుపెట్టనున్నారు. దాంతో ఈ భారీ అంకె మీద ఇపుడు చర్చ సాగుతోంది. బీజేపీలో ఎంత మేరకు చర్చ సాగుతోంది అన్నది పక్కన పెడితే ప్రత్యర్థి పార్టీలు ఈ అంకెను చూపిస్తూ మోడీకి బీజేపీ పరివార్ కి గతాన్ని గుర్తు చేస్తున్నాయి. శివసేన యూబీటీకి చెందిన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ అయితే ఇదే పట్టుకున్నారు.
మోడీ పదవీ కాలం మరో అయిదు నెలలు మాత్రమే అని కూడా చెప్పేస్తున్నారు. ఏడున్నర పదుల వయసు కలిగిన వారు స్వచ్ఛందంగా తప్పుకోవాలన్నది ఆర్ఎస్ఎస్ నిబంధన అని చెబుతున్నారు. ఆ విధంగా చూస్తే మోడీ సెప్టెంబర్ 17 తరువాత మాజీ ప్రధాని అవుతారు అని ఆయన తనదైన జోస్యం వదులుతున్నారు.
అయితే దీని మీద బీజేపీ లోపల ఏమి చర్చ జరుగుతోందో తెలియదు కానీ బయటకు మాత్రం ఎవరూ ఏమీ అనడం లేదు. ఇక ఆర్ఎస్ఎస్ తెచ్చిన నిబంధన ఇది అని సంజయ్ రౌత్ చెబుతున్నా సంఘ్ పరివార్ నుంచి ఏమీ స్పందన లేదు. కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ మాత్రం దీనిని పూర్తి స్థాయిలో ఖండించారు. నరేంద్ర మోడీ ఇప్పట్లో దిగిపోరని ఆయన స్పష్టం చేశారు.
ఆయన ఫుల్ టెర్మ్ ప్రధానిగా ఉంటారని చెబుతూనే 2029లో మళ్ళీ బీజేపీ గెలుస్తుందని అపుడు కూడా మోడీయే ప్రధాని అని కూడా ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. అంటే నరేంద్ర మోడీకి 75 ఏళ్ళ నిబంధన వర్తించదు అన్నట్లుగానే ఆయన మాట్లాడారు అని అంటున్నారు. మరి గతంలో ఈ నిబంధన వల్ల బీజేపీలో వరిష్ట నేతలు అంతా రాజకీయాలకు దూరం అయ్యారు కదా వారి సంగతేంటి అన్న చర్చ వస్తోంది.
వారి కోసమే ఈ నిబంధన తెచ్చారా అన్న టక్ కూడా ఉంది. బీజేపీ లాంటి పార్టీలు సిద్ధాంతాల మీద నడుస్తాయి. విధానాలు కూడా వ్యక్తుల కోసం ఉండవు. వ్యవస్థ కోసమే ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే 75 ఏళ్ళకే పదవులు వదులుకోవాలన్నది నిజంగా అమలు చేస్తే నరేంద్ర మోడీకే ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. అలా కాదని మోడీని మినహాయిస్తే మాత్రం బీజేపీ కూడా తేడా పార్టీ కాదని ఇతర పార్టీల మాదిరిగా ఆ తానులో ముక్కే అని అంతా అనుకుంటారు. ఏది ఏమైనా భారీ అంకె మాత్రం మోడీతో పాటు బీజేపీని ఇబ్బంది పెడుతుందా అన్న చర్చ అయితే సాగుతోంది.