ఆర్-టీవీపై 100 కోట్ల పరువు నష్టం దావా!
అయితే.. ఈ ఒప్పందంపై ఆర్-టీవీ ఇటీవల కొన్ని కథనాలు ప్రసారం చేసింది. 'భారీ కుంభకోణం' పేరుతో ప్రసారం చేసిన ఈ కథనాన్ని బ్యాంకు సీరియస్‌గా తీసుకుంది.
By: Tupaki Desk | 17 July 2024 6:32 PM GMTప్రముఖ జర్నలిస్టు రవిప్రకాశ్ నేతృత్వంలోని ఆన్‌లైన్ ఛానెల్ ఆర్-టీవీపై లండన్‌కు చెందిన యూరో ఎక్జిమ్ బ్యాంక్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తమ వినియోగదారుడిపై తప్పు తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతోపాటు.. బ్యాంకు పరువుకు భంగం వాటిల్లేలా వ్యవహరించిన నేపథ్యంలో బ్యాంకు ఈ మేరకు దావా వేసినట్టు తెలిపింది. అదేవిధంగా రవిప్రకాశ్‌కు న్యాయ పరమైన(లీగల్) నోటీసులు కూడా పంపించింది.
ఏంటీ కేసు?
ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వైసీపీ హయాంలో పలు పనులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూరో బ్యాంకుకు ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. దీంతో మేఘా సంస్థ పెద్ద మొత్తంలో నిధులు తెచ్చుకుని పనులు చేపట్టింది. అయితే.. ఈ ఒప్పందంపై ఆర్-టీవీ ఇటీవల కొన్ని కథనాలు ప్రసారం చేసింది. 'భారీ కుంభకోణం' పేరుతో ప్రసారం చేసిన ఈ కథనాన్ని బ్యాంకు సీరియస్‌గా తీసుకుంది. యూరో బ్యాంకు నకిలీదని.. ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందాలు కూడా.. నకిలీవని కథనంలో ప్రసారం చేసినట్టు బ్యాంకు తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు పరువుకు నష్టం వాటిల్లిందని తెలిపింది.
అంతేకాదు.. ఆర్-టీవీ ప్రసారం చేసిన కథనం కారణంగా.. తమ కంపెనీకి భారీ ఆర్థిక నష్టం కూడా వాటిల్లినట్టు బ్యాంకు నోటీసుల్లో పేర్కొంది. పరువు ప్రతిష్టలు కూడా భంగపడ్డాయని ఆ నోటీసులో ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థయిర్యం దెబ్బతింది అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేశామని.. అయినా స్పందన లేకపోవడంతో పరువు నష్టం దావా వేసినట్టు తెలిపింది. ఇక, తమ బ్యాంకు లండన్ కేంద్రంగా పనిచేస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల భాగస్వామ్యంతో అనేక పనులు చేపడుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో భారత్‌లో కూడా పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంకు గ్యారంటీలను చట్టబద్ధంగా ఇస్తోందని పేర్కొంది. దీనిని తప్పుబడుతూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా.. ఆర్-టీవీ కథనాలు ప్రసారం చేసినట్టు నోటీసుల్లో తెలిపింది.