Begin typing your search above and press return to search.

104 ఏళ్ల వయసులో 4,100 మీటర్ల ఎత్తునుంచి జంప్!

చికాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది. దిగ్విజయంగా స్కైడైవ్ పూర్తి చేసిన అనంతరం డొరొతీ హాఫ్‌ మన్ చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న వారికి అభివాదం చేశారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 9:15 AM GMT
104 ఏళ్ల వయసులో 4,100 మీటర్ల ఎత్తునుంచి  జంప్!
X

సాధారణంగా 60 ఏళ్లు వస్తే రిటైర్ అయిపోతారు.. 70 వస్తే ఓన్లీ వాకింగ్.. 80 వస్తే కష్టం అయిపోయిన రోజులు అనేవి చాలా మంది చెబుతున్న మాట. ఇక ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, కాలుష్యం కారణంగా సెంచరీ చేయడం అంటే ఆల్ మోస్ట్ అసాధ్యం అనే పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెంచరీ దాటడమే కాకుండా... స్కైడైవింగ్ చేసింది ఓ పెద్దావిడ!

అవును... నమ్మడానికి షాకింగ్ గా అనిపించినా... ఇది అక్షరాలా నిజం! 104 ఏళ్ల వయసులో ఓ పెద్దావిడ స్కైడైవింగ్ చేశారు. ఫలితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. అంత పెద్ద వయసులో స్కైడైవింగ్ అనే టెన్షన్ ఏమీ ఆమెలో కనిపించలేదు. అవును... ఆమె కళ్లల్లో బెదురు లేదు, చూపులో బెరుకు లేదు అన్నట్లుగా సాగిపోయింది ఆమె డైవ్!

వివరాళ్లోకి వెళ్తే... గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా పెట్టుకున్న ఓ వృద్ధురాలు అనుకున్నది సాధించారు. అమెరికాకు చెందిన 104 ఏళ్ల డొరొతీ హాఫ్‌ మన్ తాజాగా స్కైడైవింగ్ చేశారు. నిపుణుడైన మరో స్కైడైవర్‌ తో కలిసి ఆమె ఈ సాహసం చేశారు. ఇందులో భాగంగా... విమానం 4,100 మీటర్ల ఎత్తున ఉండగా జంప్‌ చేశారు.

చికాగోలో ఈ ఘటన చోటుచేసుకుంది. దిగ్విజయంగా స్కైడైవ్ పూర్తి చేసిన అనంతరం డొరొతీ హాఫ్‌ మన్ చిరునవ్వులు చిందిస్తూ అక్కడున్న వారికి అభివాదం చేశారు. ఈ సందర్హంగా... స్కైడైవింగ్ చేసిన అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా తనకు రికార్డు దక్కుతుందని డొరొతీ ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నది సాధించారు!

కాగా స్వీడెన్‌ కు చెందిన లినేయా లార్సన్ పేరిట ఈ రికార్డు ఉంది. ఆమె 2022 మే నెలలో స్కైడైవింగ్ దిగ్విజయంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అప్పటికి ఆమె వయసు 103 సంవత్సరాలు!