సవతి కూతురుపై అఘాయిత్యం... 141 ఏళ్ల జైలు శిక్ష!
మనిషిలో మానవత్వం పాళ్లు విడతల వారీగా తగ్గిపోతున్నాయనే చర్చ గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మనిషి మృగంగా మారుతున్న దశ ఇప్పటికే వచ్చేసిందనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తుంది.
By: Tupaki Desk | 1 Dec 2024 10:05 AM GMTమనిషిలో మానవత్వం పాళ్లు విడతల వారీగా తగ్గిపోతున్నాయనే చర్చ గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మనిషి మృగంగా మారుతున్న దశ ఇప్పటికే వచ్చేసిందనే చర్చ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. వావి వరసలు మరిచిపోయి, పసి పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ల వరకూ మృగాళ్ల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో... సవతి కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ మృగాడు.
అవును... తన తల్లి ఇంట్లో లేని సమయంలో తన మైనర్ సవతి కుమార్తెపై కన్నేశాడో వ్యక్తి. ఈ క్రమంలో ఆమెపై పదే పదే అత్యాచారం చేశాడు. ఈ ఘటన కేరళలో జరిగింది. ఈ వ్యవహారంపై కోర్టు తీరుపు ఇస్తూ... సదరు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 141 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. మంజేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది.
ఫోక్సో చట్టం, ఐపీసీ, జువైనెల్ జస్టిస్ చట్టం కింద వివిధ నేరాలకు గానూ దోషి ఏక కాలంలో ఈ శిక్ష అనుభవించలని జడ్జి జస్టిస్ ఆస్రాఫ్ నవంబర్ 29వ తేదీన తీర్పు వెలువరించారు. అయితే.. దోషి 40 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. అతడికి విధించిన శిక్షల్లో ఇదే అత్యధికమని ఆయన ఆ తీర్పులో పేర్కొన్నారు.
ఇదే సమయంలో... బాధితురాలికి పరిహారంగా రూ.7.85 లక్షలు చెల్లించాలని కూడా దోషిని ఆదేశించారు. బాలికపై ఆమె తల్లి ఇంట్లో లేని సమయాల్లో 2017 నుంచి సవతి తండ్రి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. స్నేహితుడి సలహా మేరకు బాలిక చివరకు తన తల్లికి చెప్పిందని.. దీంతో వ్యవహారం వెలుగులోకి వచిందని పేర్కొన్నారు.