Begin typing your search above and press return to search.

ప్ర‌శాంత మియాపూర్‌లో అల‌జ‌డి.. వెయ్యి మంది పోలీసులు.. 144 సెక్ష‌న్ ఏం జ‌రిగింది?

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లోని మియాపూర్ అంటే..ప్ర‌శాంత‌త‌కు మారు పేరు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 12:00 PM GMT
ప్ర‌శాంత మియాపూర్‌లో అల‌జ‌డి.. వెయ్యి మంది పోలీసులు.. 144 సెక్ష‌న్ ఏం జ‌రిగింది?
X

తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లోని మియాపూర్ అంటే..ప్ర‌శాంత‌త‌కు మారు పేరు. పాత‌బ‌స్తీ.. దిల్‌షుక్ న‌గ‌ర్, ఖైర‌తాబాద్‌, కూక‌ట్ ప‌ల్లి వంటి కీల‌క ప్రాంతాల‌తో పోలిస్తే.. మియాపూర్ ఎప్పుడూ.. ప్ర‌శాంతంగానే ఉంటుంది. ఇక్క‌డ అరాచ‌కాలు.. రెచ్చ‌కొట్టుకోవ‌డాలు.. అల‌జ‌డులు వంటివి లేవు. కానీ..ఇప్పుడు ఒక్క‌సారిగా మియాపూర్ వార్త‌ల్లోకి ఎక్కింది. అంతేకాదు.. ఇక్క‌డ పెను అల‌జ‌డి కూడా చోటు చేసుకుంది. ఏకంగా వెయ్యి మంది పోలీసులు మియాపూర్‌ను అష్ట‌దిగ్భంధం చేశారు.

అంతేకాదు.. 144 సెక్ష‌న్ ను మియాపూర్ అంత‌టా అమ‌లు చేస్తున్నారు. దీనికి కార‌ణ‌మేంటి? మ‌త ఘ‌ర్ష‌ణ‌లా..? కుల ఘ‌ర్ష‌ణ‌లా.. అంటే.. కాదు. కేవ‌లం భూక‌బ్జా ఆరోప‌ణ‌లు.చిత్రంగా ఉన్నా.. నిజం. భూక‌బ్జా ఆరోప‌ణ‌లు రావ‌డంతో ఇక్క‌డ అల‌జ‌డి రేగింది. వంద‌ల ఎక‌రాల భూముల‌ను కొంద‌రు పేదలు దౌర్జ‌న్యంగా ఆక్ర‌మిస్తున్నారంటూ.. స్థానికులు క‌దం తొక్కారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి ఉంది. ఫ‌లితంగా మియాపూర్‌, చందానగర్‌లో సైబరాబాద్ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇదేస‌మ‌యంలో ఏకంగా వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించి భారీ భద్రత ఏర్పాటు చేశారు.

విష‌యం ఏంటి?

స్థానికంగా మియాపూర్ ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఒక‌టిగా ఉంది. రియ‌ల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దీంతో ఇక్క‌డి సర్వే నెంబర్ 100, 101 వద్ద ఉన్న వందల ఎకరాల స్థలాన్ని కొంత మంది ఆక్ర‌మించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న వార్త‌ల‌తో అల‌జ‌డి రేగింది. ఈ భూమి 450 ఎకరాలు ఉంటుందని అధికారులు తెలిపారు. అంతేకాదు.. ఇది ప్ర‌భుత్వ భూమి. పైగా హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ చేతిలో ఉంది. కానీ, ఇక్క‌డ పేద‌లు తాజాగా గుడిసెలు వేసుకున్నారు.

ఇళ్లు లేని పేద‌ల‌కు రేవంత్‌రెడ్డి స‌ర్కారు ఇళ్లు ఇస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చింది. దీంతో కొన్ని వ‌ర్గాలు వాట్సాప్ గ్రూపుల్లో.. మియాపూర్‌లో ఉన్న స‌ర్కారు భూమి పేద‌ల‌దే అంటూ.. ప్ర‌చారం చేశారు. అంతే.. ఎక్క‌డెక్క‌డ నుంచో వ‌చ్చిన పేద‌లు..ఇక్క‌డ గుడిసెలు వేసుకున్నారు. దీంతో స్థానికులు బ‌య‌ట‌కు వ‌చ్చి.. పేద‌ల‌ను త‌రిమికొట్టే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో రంగంలోకి దిగిన పోలీసులు.. 144 సెక్ష‌న్ విధించి.. గుడిసెలు వేసుకున్న పేద‌ల‌ను అక్క‌డ నుంచి త‌రిమి కొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు.. ఇది రాజ‌కీయ రంగు పులుముకుంటున్న నేప‌థ్యంలో వేల మంది పోలీసుల‌ను మోహ‌రించారు.