స్కూలుకెళుతూ.. గుండెపోటుతో 10వ తరగతి విద్యార్థి మృతి
కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల శ్రీనిధి కామారెడ్డిలో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. ఆమె పాఠశాల వద్ద ఛాతి నొప్పితో బాధపడుతూ కుప్పకూలింది.
By: Tupaki Desk | 21 Feb 2025 5:59 AM GMTపట్టుమని 16 ఏళ్లు కూడా నిండని పసి హృదయాలు గుండెపోటుతో మరణించడం విషాదం నింపుతోంది. ముక్కుపచ్చలారని చిన్నారులను కూడా ఈ గుండెపోటు కబళిస్తోందంటే మన ఆహారపు అలవాట్లు, మన దినచర్యలు ఎంతో ఘోరంగా మారాయో అర్థం చేసుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం పాఠశాలకు కాలినడకన వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మరణించడం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర విషాదం నింపింది.
కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి గ్రామానికి చెందిన 16 ఏళ్ల శ్రీనిధి కామారెడ్డిలో ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతోంది. ఆమె పాఠశాల వద్ద ఛాతి నొప్పితో బాధపడుతూ కుప్పకూలింది. ఒక ఉపాధ్యాయురాలు ఆమెను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించగా, సిపిఆర్ (కార్డియోపల్మనరీ రెససిటేషన్) కూడా చేశారు.. అయితే, ఆమె స్పందించకపోవడంతో మరో ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రకటించారు.
పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంతటి చిన్న వయసులో అమ్మాయి గుండెపోటుతో మరణించడంతో చాలా మంది విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. శ్రీ నిధి భౌతిక కాయాన్ని ఆమె స్వగ్రామానికి తరలించారు.
కొన్ని నెలల కిందట, అలీగఢ్‌లోని సిరౌలి గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి మోహిత్ చౌదరి ఇలానే గుండెపోటుతో మరణించాడు. 14 ఏళ్ల మోహిత్ వార్షిక క్రీడా దినోత్సవ పోటీకి సిద్ధమవుతుండగా, ప్రాక్టీస్ రన్ చేస్తున్న సమయంలో కుప్పకూలిపోయాడు.ఇంకొక బాలిక, 8 ఏళ్ల వయసులో ఇదే జిల్లాలో తన స్నేహితులతో ఆడుకుంటూ గుండెపోటుతో మరణించింది.
అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎం. రబ్బానీ మాట్లాడుతూ గుండెపోటు మరణాల సంఖ్య గత 2 ఏళ్లలో 22% పెరిగిందని తెలిపారు. "ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ఒక్క గంటలోపు అకస్మాత్తుగా మరణిస్తే, దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. ఇది గత 20 ఏళ్లలో 22 శాతం పెరిగింది. ఒక పిల్లవాడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినా, ఛాతి నొప్పి ఉందని చెప్పినా, వెంటనే వైద్య పరీక్ష చేయించుకోవాలి," అని ప్రొఫెసర్ సూచించారు.