తెలుగు పాలిటిక్స్ 2024 : షర్మిలకు కలసి రాని క్యాలెండర్ !
ఇలా 2024 మొదట్లో షర్మిల రాకతో కాంగ్రెస్ లో కనిపించిన ఉత్సాహం ఏడాది చివరికి వచ్చేసరికి నీరు కారిపోయేలా చేసింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2024 3:40 AM GMTతెలంగాణా నుంచి ఒక్కసారిగా ఏపీ రాజకీయాలకు షిఫ్ట్ అయిన వైఎస్ షర్మిల తాను స్థాపించిన వైఎస్సార్ టీపీని కూడా దాని కోసం కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ వెంటనే ఆమెను ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నియమించారు. కాంగ్రెస్ లో ఇలా చేరిన వెంటనే అలా పీసీసీ చీఫ్ అంటే షర్మిల రికార్డు క్రియేట్ చేశారు అని అనుకున్నారు అంతా.
వైఎస్సార్ రక్తం కావడంతో పాటు ఏపీ సీఎం గా ఉన్న జగన్ కి సోదరిగా ఉండడంతో షర్మిలకు ఈ ప్రయారిటీ దక్కింది. ఆమె ద్వారా ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది అని కాంగ్రెస్ పెద్దలూ ఆశించారు. ఏపీలోని సీనియర్లూ అదే నిజమని భావించారు. ఇక రాజకీయ విశ్లేషకులు సైతం ఈసారి కాంగ్రెస్ అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఖాయమని అనుకున్నారు.
దానికి తగినట్లే షర్మిల దూకుడు కనిపించింది. ఆనాడు అధికారంలో ఉన్న వైసీపీని ఆమె ఎక్కడా స్పేర్ చేయకుండా విమర్శించారు. జగన్ మీద ఒక రేంజిలో విమర్శలు చేస్తూ వెళ్లారు. అదే సమయంలో ఆమె ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని విమర్శించలేకపోయారు.
రాజకీయంగా ఈ వ్యూహాత్మకమైన తప్పుడు వైఖరి కాంగ్రెస్ ని దెబ్బ తీసింది. జగన్ ని వైసీపీని విమర్శించడం ద్వారా ఎన్నికల వేళ కూటమికి కొత్త బలంగా మారారు తప్పించి కాంగ్రెస్ వైపు జనాలకు తిప్పలేకపోయారు. అటు కూటమి ఇటు వైసీపీ రెండింటినీ గట్టిగా విమర్శించి కాంగ్రెస్ అవసరం ఏపీకి ఎందుకో చెప్పి ఉన్నట్లు అయితే కాంగ్రెస్ కి ఒకటి రెండు సీట్లు అయినా దక్కేవన్న విశ్లేషణలు ఉన్నాయి.
మొత్తానికి కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల కూడా డిపాజిట్లు పోగొట్టుకుని ఓటమి పాలు అయ్యారు. సరే ఎన్నికల తరువాత అయినా వ్యూహం మార్చాల్సి ఉంది. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం మీద ధాటీగా విమర్శలు చేయాల్సిన షర్మిల ఆ విషయంలో కూడా ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించలేదు అన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీనే మళ్ళీ విమర్శిస్తూ పోయారు.
దాంతో ఎన్నికల ముందు వరకూ ఆమె వెంట ఉన్న కాంగ్రెస్ సీనియర్లు తరువాత కనిపించడం మానేశారు. ఆమెది కాంగ్రెస్ లో ఒంటరి పోరాటం అయింది. ఆమె కూడా సింగిల్ పాయింట్ అజెండా మాదిరిగా జగన్ చుట్టూతా తన రాజకీయాన్ని తిప్పుతూ కాంగ్రెస్ ఎదుగుదలను మరచిపోయారు అని అంటున్నారు. దాంతో వైసీపీ నుంచి గడచిన ఆరు నెలల కాలంలో బయటకు వచ్చిన నేతలు అంతా కూటమిలోని పార్టీల వైపే వెళ్లారు తప్ప ఒక్కరు కూడా కాంగ్రెస్ పక్షాన రాలేకపోయారు.
ఇలా 2024 మొదట్లో షర్మిల రాకతో కాంగ్రెస్ లో కనిపించిన ఉత్సాహం ఏడాది చివరికి వచ్చేసరికి నీరు కారిపోయేలా చేసింది అని అంటున్నారు. ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ బలపడదు అన్న నిశ్చయానికి కాంగ్రెస్ సీనియర్లు వచ్చేస్తున్నారు అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు కూడా కొత్త ఏడాదిలో ఏపీలో కీలక నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ని ప్రక్షాళన చేస్తారని అంటున్నారు.
ఈ నేపధ్యంలో 2024లో ఏపీలో కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల తాను లోక్ సభకు కచ్చితంగా నెగ్గుతాను అనుకుంటే అది తారు మారు అయింది. కాంగ్రెస్ లోకి తన పార్టీని విలీనం చేసినందుకు రాజ్యసభ సీటు అయినా ఇస్తారు అనుకుంటే ఆ ఆశ కూడా నెరవేరలేదు అని అంటున్నారు. మొత్తానికి ఆమెకు 2024 ఏ విధంగానూ కలసిరాలేదు అని అంటున్నారు.
ఆమె కాంగ్రెస్ చీఫ్ గా ఉంటూనే అటు పార్టీకి ఇటు తనకు భవిష్యత్తు భరోసాను ఇచ్చే విధంగా 2024లో గట్టి వ్యూహాలను రూపొందించలేకపోయారు అని అంటున్నారు. అయితే షర్మిల ఏపీ రాజకీయాల్లో మాత్రం ఈ ఏడాది తనదైన సంచలనాలతో ఒక ముద్ర వేశారు. ఆమె వైసీపీని ఇబ్బంది పెట్టగలిగారు. అదే సమయంలో ఆమె తన రాజకీయ లక్ష్యం లో అత్యంత ముఖ్యమైనదిగా భావించేదిగా ఉన్న జగన్ ని మాజీ సీఎంగా చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు అని అంటున్నారు. మరి 2025లో ఆమె రాజకీయం ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సి ఉంది.