Begin typing your search above and press return to search.

కింజరాపు కుటుంబానికి అలా కలిసొచ్చింది

తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం తర్వాత అంతే పవర్ ఫుల్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కింజరాపు కుటుంబమే.

By:  Tupaki Desk   |   22 Dec 2024 3:30 PM GMT
కింజరాపు కుటుంబానికి అలా కలిసొచ్చింది
X

రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. చీకటి తర్వాత వెలుగు వస్తుంటుంది. ఒక్కోసారి అలా వచ్చిన వెలుగు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2024 సంవత్సరం కూడా కొందరికి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తే ఆ విజయంలో ఎక్కువ ఆనందం కింజరాపు కుటుంబానికి దక్కుతుంది. ఎందుకంటే ఆ ఒక్క కుటుంబం నుంచే నలుగురు నేతలకు ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేసే అవకాశమిచ్చింది 2024.

తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబం తర్వాత అంతే పవర్ ఫుల్ ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది కింజరాపు కుటుంబమే. పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న ఈ ఫ్యామిలీ బంధువర్గం అంతా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల ముందు వరకు కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తే ఎన్నికల అనంతరం మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఆయన సీనియర్టీ, సామర్థ్యం వల్ల మంత్రి అవ్వడంలో పెద్ద విశేషం లేకపోయినా, అదే కుటుంబానికి చెందిన రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రిగా, అచ్చెన్నకు రాష్ట్ర మంత్రిగా ఒకే సారి అవకాశం దక్కడం పెద్ద విశేషంగానే చెప్పొచ్చు. ప్రాంతీయ పార్టీల్లో ఇలా ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అవకాశం దక్కడం బహు అరుదు. పార్టీ అధినేతల కుటుంబాలకు మాత్రమే ఇలాంటి మినహాయింపు ఉంటుంది. టీడీపీలో చంద్రబాబు, లోకేశ్ ఒకే కుటుంబమైనా ఆ ఇద్దరూ కీలక పదవుల్లో ఉండటం సహజమే. కానీ, కింజరాపు కుటుంబంలో మాత్రం ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేయడం 2024లో ఒక రికార్డుగానే చెప్పొచ్చు.

కింజరాపు కుటుంబం నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచారు. ఆయనకన్నా పార్టీలో ఎందరో సీనియర్లు ఉన్నప్పటికీ సమర్థుడైన యువనేతగా ఆయనను కేంద్రమంత్రి చేశారు సీఎం చంద్రబాబు. ఇక టెక్కలిలో ఎదురేలేని అచ్చెన్నాయుడు ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు సీఎం. అదేవిధంగా ఇదే కుటుంబానికి చెందిన మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ ఏడాది అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వాసు తొలిసారి ఎమ్మెల్యే అయితే, బండారు సుదీర్ఘకాలం తర్వాత శాసనసభలో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి బండారు స్వయాన మామ కాగా, ఆదిరెడ్డి వాసు బావ అవుతారు.

అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో బండారు సొంత నియోజకవర్గమైన పెందుర్తి జనసేనకు కేటాయించారు. దీంతో బండారు ఆశలు అవిరయ్యాయి. అయితే కింజరాపు కుటుంబం ఒత్తిడితో చివరి నిమిషంలో ఆయనకు మాడుగుల టికెట్ కేటాయించారు. ఇలా కింజరాపు కుటుంబం నుంచే నలుగురు 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజేతలుగా నిలవడం ఆ కుటుంబానికి ప్రత్యేకంగా చెబుతున్నారు. అంతేకాకుండా గెలిచిన నలుగురిలో ఇద్దరికి కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు దక్కడమూ విశేషమే..