Begin typing your search above and press return to search.

జీరోలను హీరోలుగా మార్చిన 2024

పరోక్షంగా కానీ ప్రభావితం చేసిన ప్రముఖుల జీవితాల్లో 2024 ఎలా ఉందన్న విషయాన్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

By:  Tupaki Desk   |   1 Jan 2025 4:51 AM GMT
జీరోలను హీరోలుగా మార్చిన 2024
X

కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోయింది. నిన్నటి వరకు వర్తమానంగా ఉన్న 2024 ఏడాది ఇప్పుడు గతంగా మారింది. కొత్త ఆశలకు.. ఆశయాలకు నెలవుగా కొత్త ఏడాది ఎంట్రీ ఇచ్చింది. జీవితపు క్యాలెండర్ లో మరో కొత్త ఏడాది వచ్చేసింది, ఇదంతా ఒక ఎత్తు అయితే.. గడిచిన ఏడాదిని చూసినప్పుడు.. మనకు బాగా తెలిసి.. మన జీవితాన్ని ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ప్రభావితం చేసిన ప్రముఖుల జీవితాల్లో 2024 ఎలా ఉందన్న విషయాన్ని చూసినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని చూసినప్పుడు ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఓటమికి కుంగిపోకుండా.. కష్టపడి పని చేస్తూ. అదే పనిగా శ్రమిస్తూ.. అవకాశాల కోసం ఎదురుచూసే కన్నా.. అవకాశాన్ని తమకుతాముగా కల్పించుకుంటూ పోతే, సక్సెస్ ఆటోమేటిక్ గా రావటమే కాదు.. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులుగా నిలిచిపోతారు. 2024కు ముందు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని.. అంతటి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంటారని కాని ఊహించి ఉండరు.అంతేకాదు.. జైలుకు వెళతానని కూడా అనుకొని ఉండరు. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో జైలు గడప తొక్కని చంద్రబాబు.. అందుకు భిన్నంగా నెలల తరబడి జైల్లో మగ్గాల్సిన దుస్థితి.. ఆ సందర్భంగా ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఒక ఎత్తు అయితే.. చంద్రబాబు జైల్లోకి వెళ్లిన వైనంపై తెలుగు ప్రజల నుంచి వచ్చిన రియాక్షన్ మాత్రం చాలామంది ఊహించనిదిగా చెప్పాలి.

తనకు తిరుగులేదని భావించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. వాస్తవాన్ని గుర్తించటం.. మనం అనుకున్నదే కరెక్టు అన్న ఆత్మవిశ్వాసం మోతాదు దాటితే కలిగే నష్టం ఎంతన్నది కళ్లకు కట్టినట్లుగా అర్థమవుతుంది. మరోవైపు తెలంగాణ విపక్ష నేత కేసీఆర్ ను చూసినప్పుడు.. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదన్న విషయం అర్థమవుతుంది. ఎన్నికల్లో ఓటమి చెందితే.. అందుకు కారణమైన ప్రజల మీద కినుకుతో ఫాంహౌస కే పరిమితం కావటం.. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తనదైన ప్రపంచానికే పరిమితం కావటం సరికాదన్న భావన కలుగక మానదు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడ్ని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు పవర్ చేతిలో లేనప్పుడు సైతం ఒకేలా వ్యవహరించటం.. నిత్యం ప్రజల మధ్యనే ఉండటం ఎలా అన్నది చంద్రబాబును చూస్తే అర్థమవుతుంది.

అంతేకాదు.. ఏ ప్రజలు అయితే తనను తిరస్కరించారో.. అదే ప్రజల చేత జైజైలు కొట్టించుకోవటం ఎలా అన్నది ఆయనకు బాగానే తెలుసు. ఇక.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను చూస్తే.. వరుస ఓటములు చిరాకు పుట్టిస్తున్నా.. పట్టుదలతో వాటిని ఎదుర్కోవటం.. ప్రజల పట్ల తనకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని చాటి చెబుతూ.. తన మీద ప్రత్యర్థులు చేసే వ్యాఖ్యలకు రెచ్చిపోకుండా..తనదైన టైం కోసం వెయిట్ చేస్తూ.. గురి చూసి కొట్టినట్లుగా వ్యవహరించే తత్త్వం జీవితంలో ప్రతి ఒక్కరికి అవసరం. అలాంటి తీరు ఉంటే.. అపజయం తాత్కాలికంగా పలుకరించినా.. అద్భుత విజయం సొంతం కావటానికి అట్టే టైం తీసుకోదన్నది అర్థమవుతుంది. ప్రతి తెలుగువాడిని ప్రభావితం చేసే ఈ నలుగురు అధినేతలు.. మనకు తెలీకుండానే జీవితపాఠాలు నేర్పిస్తుంటారు. ఇక్కడ గెలుపు - ఓటముల గురించి మాట్లాడటం లేదు. తమకు ఎదురైన సవాళ్లను ఎవరెలా డీల్ చేశారు? అని చెప్పటమే ఉద్దేశం. ఆల్ ద బెస్టు.