Begin typing your search above and press return to search.

2024లోనూ 2009 రిజల్ట్...ఏపీలో సీన్ రిపీట్...!?

కాలం చక్రం లాంటిది.అది తిరిగి మళ్లీ వెనకటికే వస్తుంది అని అంటారు. ఏపీలో చూస్తే ఫలితాలు 2009లో ఉమ్మడి ఏపీ లాంటివే వస్తాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 4:07 AM GMT
2024లోనూ 2009 రిజల్ట్...ఏపీలో సీన్ రిపీట్...!?
X

కాలం చక్రం లాంటిది.అది తిరిగి మళ్లీ వెనకటికే వస్తుంది అని అంటారు. ఏపీలో చూస్తే ఫలితాలు 2009లో ఉమ్మడి ఏపీ లాంటివే వస్తాయని అంటున్నారు. దానికి గల కారణాలను కూడా వివరిస్తున్నారు. 2009 నాటికి అయిదేళ్ల కాంగ్రెస్ పాలన పట్ల జనంలో కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఏర్పడింది. అదే టైం లో అయిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పుంజుకుంది.


అదే విధంగా ఇతర పార్టీలతో కలసి కూటములను కూడా కట్టింది. టీడీపీ కూటమిలో కమ్యూనిస్టులు టీఆర్ ఎస్ వంటివి చేరాయి. ఇంకో వైపు ప్రజారాజ్యం పార్టీ కూడా ఏర్పడింది. ఇలా అన్ని వైపుల నుంచి పోటీ ఏర్పడింది. అయితే వైఎస్సార్ చరిష్మాతో వీటిని అన్నింటినీ ఎదుర్కొన్నారు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఉమ్మడి ఏపీలో బొటా బొటీ మెజారిటీ దక్కింది. 157 సీట్లతో కాంగ్రెస్ సర్దుకుని రెండవసారి అధికారంలోకి రాగా 92 సీట్లతో టీడీపీ బాగా బలం పెంచుకుంది.

అయితే అధికారం మాత్రం దక్కలేదు. పోటీ మాత్రం హోరా హోరీ గా సాగింది. ఇపుడు చూస్తే ఏపీలో అలాంటి పరిస్థితే కనిపిస్తోంది అని అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. వీలైతే బీజేపీ లేకపోతే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని జనంలోకి రావాలని టీడీపీ చూస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ ఎంతో కొంత పుంజుకోవాలని చూస్తోంది. అధికార వైసీపీ సోలోగా వస్తోంది. అధికార వైసీపీ మీద వ్యతిరేకత అయితే ఉంది. అది ప్రభుత్వాన్ని దించేసేటంతగా ఉందా అంటే పూర్తిగా చెప్పలేని పరిస్థితి. అదే టైం లో టీడీపీ జనసేన 2019 నాటి కంటే పుంజుకున్నాయి. కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరిగే చాన్స్ ఉంది అంటున్నారు.

ఇలా విపక్షాలు అన్నీ ఒక వైపు ఉంటే అధికార పక్షం మరో వైపు ఉన్న దృశ్యం కనిపిస్తోంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలని వేసే ప్రతీ ఓటూ వైసీపీకి పడుతుంది. అదే వైసీపీ వద్దు అన్న ఓట్లు ఎలా కాదనుకున్న టీడీపీ కూటమితో పాటు ఇతర విపక్షాల వైపుగా చీలిపోతాయి.

దీంతో వైసీపీకి ఇది లాభమా అన్న చర్చ వస్తోంది. కాంగ్రెస్ పోటీలో ఉండడం వల్ల కలిగే లాభ నష్టాలు కూడా విపక్షాలను కొంత ఆలోచనలో పడవేసే పరిస్థితి ఉంది అని అంటున్నారు ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. 2019లో అద్భుతమైన విజయం వైసీపీకి దక్కింది. 151 సీట్లతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.

కానీ 2024లో మాత్రం అలా జరిగే చాన్సే లేదు అంటున్నారు. ఏకపక్షంగా ఏ పార్టీకి జనాలు భారీ ఎత్తున సీట్లు కట్టబెట్టే పరిస్థితి ఉండదని అంటున్నారు. దాంతో హోరా హోరీ పోరు సాగడం తధ్యం ప్రతీ ఒక్క ఓటూ ఇంపార్టెంట్ గానే ఉంటుంది. దాంతో ఎవరు అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ 88 కంటే ఒక పది నుంచి పదిహేను సీట్ల కంటే ఎక్కువ తెచ్చుకోవడం సాధ్యపడదు అని అంటున్నారు

యాంటీ ఇంకెంబెన్సీ ఎక్కువ ఉంటే విపక్షాల మధ్య ఓట్లు చీలకపోతే వైసీపీ ఇబ్బందులో పడుతుంది. అధికారానికి దూరం అవుతుంది. అపుడు టీడీపీ కూటమి గెలిచే పరిస్థితి ఉంటుంది. అదే ప్రజా వ్యతిరేకత తక్కువగా ఉండి విపక్షల మధ్య సయోధ్య సజావుగా లేని పక్షంలో వంద నుంచి నూటా పది సీట్లతో వైసీపీ అధికారంలోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ చెబుతున్న వై నాట్ 175 కానీ అలాగే టీడీపీ చెబుతున్నట్లుగా 160 సీట్లు కానీ ఈసారి జనాలు ఇచ్చే చాన్సే లేదని అంటున్నారు.