కొత్త బడ్జెట్ : ధరలు తగ్గే వస్తువులు ఏంటంటే..?
ఇప్పుడు 99 శాతం స్మార్ట్ ఫోన్స్ దేశంలనే తయారవుతున్నాయి. వీటికి భారీ ప్రోత్సహకాలు ఇవ్వడంతో ఇకపై దేశీయంగా తయారయ్యే సెల్ ఫోన్ ధరలు భారీగా తగ్గుతాయి.
By: Tupaki Desk | 1 Feb 2025 1:27 PM GMTకేంద్ర ఆర్థిక బడ్జెట్ పలు రంగాలను ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల వల్ల కొన్ని రంగాలకు ప్రోత్సహం దక్కుతుంది. మరికొన్ని రంగాలు అదనపు పన్నులు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల బడ్జెట్ అనంతరం కొన్ని రకాల వస్తువులు ధరలు పెరుగుతాయి. అదే సమయంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. ఈ సారి బడ్జెట్ వల్ల ఎక్కవ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉన్నాయి. అదేవిధంగా కొన్నిరకాల వస్తువల ధరలు పెరగనున్నాయి.
ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగంపై ప్రత్యేక ఫోకస్ చేశారు. దీనివల్ల కొన్ని రకాల మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా ప్రాణాలను కాపాడే 36 రకాల మందులను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించారు. దీనివల్ల వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన 3 ఔషధాలకు కూడా కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు లభించింది. దీనివల్ల క్యాన్సర్ చికిత్సకు ఖర్చు అయ్యే డబ్బు ఆదా అవుతుంది.
అదేవిధంగా మొబైల్ ఫోన్లలో ఉపయోగించే కాంపోనెంట్లపై పన్ను మినహాయింపు ఇచ్చారు. దీనివల్ల స్మార్ట ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఓపెన్ సేల్స్ పై బేసిక్ కస్టమ్ డ్యూటీని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం వల్ల టీవీలు ధరలు తగ్గనున్నాయి. మరోవైపు ఎలక్ట్రానిక్ వాహన రంగానికి ఊతమిచ్చేలా బడ్జెట్ రూపొందించారు. ఎలక్ట్రానిక్ వాహనాల (ఈవీ)ల్లో వాడే బ్యాటరీ తయారీకి 35 అడిషనల్ క్యాపిటల్ గూడ్స్, మొబైల్ ఫోన్ బ్యాటరీ తయారీకి 28 అడిషనల్ క్యాపిటల్ గూడ్స్ ను ప్రతిపాదించారు. వీటిలో లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేసే దేశీయ ఉత్పత్తిదారులకు స్థానం కల్పించనున్నారు. దీనివల్ల దేశంలో మొబైల్ బ్యాటరీల తయారీ ఖర్చు తగ్గుతుంది. ఇది నేరుగా వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చనుంది.
ఇక ఆర్థిక సర్వేలో స్మార్ట్ ఫోన్ దిగుమతులపై ఆధారపడటాన్ని చాలా వరకు తగ్గించామని వెల్లడైంది. ఇప్పుడు 99 శాతం స్మార్ట్ ఫోన్స్ దేశంలనే తయారవుతున్నాయి. వీటికి భారీ ప్రోత్సహకాలు ఇవ్వడంతో ఇకపై దేశీయంగా తయారయ్యే సెల్ ఫోన్ ధరలు భారీగా తగ్గుతాయి. అదేవిధంగా నౌకల తయారీకి అవసరమైన ముడి సరుకుల మీదా కస్టమ్స్ డ్యూటీని 10 ఏళ్ల పాటు మినహాయింపు ఇచ్చారు. సముద్ర ఉత్పత్తుల మీద బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 35 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. తోలుతోపాటు తోలు ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో చెప్పులు, బెల్టులు, లెదర్ బ్యాగుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
మన దేశంలో తయారయ్యే దుస్తుల ధరలు తగ్గనున్నాయి. వస్త్ర పరిశ్రమకు బడ్జెట్ అండగా నిలవడంతో దేశంలో అన్ని వస్త్రాల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్చులతోపాటు 12 రకాల కీలకమైన ఖనిజాల రేట్లు తగ్గనున్నాయి.
ఇక ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ డిస్ ప్లే మీద ట్యాక్స్ ను 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. దీంతో కొన్ని రకాల టీవీల ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా టెక్స్ టైల్ ఉత్పత్తులను ఎంకరేజ్ చేసేందుకు అల్లికల దుస్తుల మీద కస్టమ్స్ పన్ను 10 నుంచి 20 శాతానికి పెంచారు. దిగుమతి చేసుకునే కొవ్వొత్తుల ధరలు పెరగనున్నాయి. ఇంపోర్టెడ్ చెప్పులు, పీవీసీ వస్తువులు ధరలు పెరుగుతాయి. స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీల ధరలు కూడా పెరగనున్నాయి.