Begin typing your search above and press return to search.

నిర్మలమ్మ బడ్జెట్ : భారీగా తాయిలాలు ఆ వర్గాలకు ?

ఇపుడు చూస్తే 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

By:  Tupaki Desk   |   25 Jan 2025 6:30 AM GMT
నిర్మలమ్మ బడ్జెట్ : భారీగా తాయిలాలు ఆ వర్గాలకు ?
X

కేంద్ర బడ్జెట్ మరో వారంలో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని ఆమె వరసగా ఏడవసారి ప్రవేశపెట్టబోతూండడం విశేషం. ఆమె 2019లో ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు. గత టెర్మ్ లో అయిదు సార్లు బడ్జెట్ ని సమర్పించిన నిర్మలమ్మ 2024లో మరోసారి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు.

ఇపుడు చూస్తే 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉంటుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. అయితే ఆదాయపన్ను మీద భారీ మినహాయింపు ఈసారి ఆమె ఇవ్వబోతున్నారు అని అంటున్నారు.

ఇప్పటిదాకా వార్షికాదాయం ఏడు లక్షల దాకా ఉన్న వారికి పన్ను రాయితీ ఉండేది. ఇపుడు దానిని పది లక్షలకు పెంచి మరింత ఊరటను ఇస్తారని అంటున్నారు. అదే విధంగా పదిహేను నుంచి ఇరవై అయిదు లక్షల వార్షికాదాయం వచ్చే వారికి 25 శాతం పన్ను విధించే ఆలోచన ఉందని తెలుస్తోంది.

ఆదాయం పన్ను మినహాయింపు మొత్తం పెంచడం వల్ల వేతన జీవులకు భారీగా లాభం కలుగుతుందని ఆ విధంగా మధ్యతరగతి ఉద్యోగ వర్గాల మన్ననలు పొందవచ్చునని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు అయితే ఏడు నుంచి పది లక్షల దాకా ఆదాయం పన్ను రాయితీ ఇస్తే కేంద్ర ఖజానాకు ఏకంగా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడుతుందని అంటున్నారు. అయినా సరే వేతన జీవులను మచ్చిక చేసుకునేందుకు ఈ విధానం అనుసరిస్తారు అని అంటున్నారు.

పన్నుల విధానంలో కొత్త మార్పులను నిర్మలమ్మ తన బడ్జెట్ పద్దులో ప్రముఖంగా ప్రస్తావిస్తారు అని అంటున్నారు. ఒక వైపు ధరలు చూస్తే విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆదాయాలు వస్తున్నా అవి ఖర్చులకు ఏ మాత్రం సరిపోవడం లేదు దాంతో మధ్యతరగతి వర్గాలు విలవిలలాడుతున్నాయి. ఈ నేపధ్యంలో బడ్జెట్ లో వారికి ఊరటను ఇచ్చే చర్యలు నిర్మలమ్మ తీసుకుంటారని ఆశిస్తున్నారు.

బడ్జెట్ అంటే కార్పోరేట్ శక్తులకు మాత్రమే దన్నుగా ఉండేలా చర్యలు తీసుకోవడం కాకుండా దిగువ మధ్య తరగతి వర్గాలకు కూడా సమ న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక చూస్తే కనుక బడ్జెట్ లో నిరుద్యోగులకు ఏమైనా కొత్త పధకాలు కానీ వారికి ఉద్యోగ కల్పనకు బాటలు వేసే విధానాలు కానీ ప్రకటిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది.

అయితే ఉద్యోగ కల్పనకు అవసరమైన అదే విధంగా స్వయం ఉపాధికి పనికి వచ్చేలా నైపుణ్య శిక్షణను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. రైతులకు కూడా ప్రత్యేక రాయితీలతో పాటు పధకాలను ప్రకటిస్తారని అంటున్నారు

ఇక బడ్జెట్ లో ఏపీకి ఏమేమి వరాలు దక్కుతాయన్నది కూడా చర్చగా ఉంది. అమరావతి రాజధాని అలాగే పోలవరం ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు సాయం అందిస్తుంది అన్నది కూడా అంతా ఆసక్తిగా చూస్తున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ ఏమేమి మెరుపులు మెరిపిస్తుంది అన్నది అయితే చర్చనీయాంశంగా ఉంది.