ఒక విమానం..ఒకటే బాత్రూం..205 మంది.. అమెరికా నుంచి తిరుగు టపా
భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో బయల్దేరిన విమానం మన దేశానికి. సీ17 ఎయిర్ క్రాఫ్ట్ లో కొందరిని తరలించినట్లుగా కథనాలు వచ్చాయి.
By: Tupaki Desk | 4 Feb 2025 7:49 AM GMTఅక్రమ వలసదారులే లక్ష్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపోర్టేషన్ కొనసాగుతోంది. సరైన ధ్రువపత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్నవారిని గుర్తించి ఆయా దేశాలకు ప్రత్యేక విమానాల్లో పంపించేస్తోంది అగ్రరాజ్యం. ఇలానే భారత్ కు చెందిన అక్రమ వలసదారులతో ఓ విమానం బయల్దేరింది. దీనిపేరు సీ17 ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో కొందరిని తరలించినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఎందరు? అనేది సంఖ్య తెలియరాలేదు. కాగా, ఈ విమానంలో 205 మంది భారతీయులు ఉన్నారని ఇంగ్లిష్ మీడియా చెబుతోంది. ఇది పంజాబ్ లోని అమృత్ సర్ చేరుకుంటుందని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని గంటల క్రితం ఓ విమానం భారత్ కు బయల్దేరింది.
కాగా, సీ-17 యూఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్. ఇది భారత్ కు చేరేందుకు 24 గంటలు పడుతుందని అంచనా. అంటే.. బుధవారం వరకు వీరు చేరొచ్చు. ఇక అక్రమ వలసదారులపై ట్రంప్ తొలినుంచి ఒకటే మాట మీద ఉన్న సంగతి తెలిసిందే. పదవీ బాధ్యతలు చేపట్టడంతోనే ఆ దిశగా పని మొదలుపెట్టారు. అక్రమ వలసదారుల గుర్తింపు, తరలింపు వేగిరం చేశారు. ఇప్పటికే 538 మందిని అరెస్టు చేసి వారివారి దేశాలకు పంపించారు. ఎల్ పాసో, టెక్సస్, శాన్ డియాగో, కాలిఫోర్నియాలో ఉన్న 5 వేల మంది అక్రమ వలసదారులను తరలించేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాయలం పెంటగాన్ సిద్ధమైంది. ఇప్పటికే గటేమాలా, పెరు, హోండూరస్ లకు విమానాల్లో పలువురిని తరలించారు.
ఒక్కో వలసదారుని తరలించేందుకు అమెరికా 4,675 డాలర్లను ఖర్చు పెడుతోంది అని చెబుతున్నారు. కాగా, అమెరికా నుంచి భారత్ కు చేరిన విమానంలో 205 మంది ఉన్నారని తెలిసింది. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్ నుంచి సీ-17 సైనిక విమానంలో వీరందరినీ పంపారు. అక్రమ వలసదారులను తిరిగి తీసుకొచ్చే విమానాలలో ఇదే మొదటిది అని భావిస్తున్నారు.
బహిష్కరణ ప్రక్రియలో ఢిల్లీ ప్రమేయాన్ని సూచిస్తూ ప్రతి వ్యక్తి గుర్తింపును ధ్రువీకరించారు. సి-17 సైనిక విమానం. దీంతో ఇందులో పౌర విమానం తరహాలో వసతులు ఉండవు. 205 మందిని తీసుకొచ్చినా.. ఈ విమానంలో ఒకటే బాత్ రూమ్ ఉండడం గమనార్హం.
అక్రమ వలసదారులపై అమెరికా విధానం పట్ల భారత్ తన స్పందన తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఈ అంశం అనేక రకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని పేర్కొంది. వీసా గడువు ముగిసినా లేదా సరైన డాక్యుమెంట్లు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడున్నా తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని స్పష్టం చేసింది. అమెరికాలో సరైన ధ్రువపత్రాలు లేకుండా భారత్ కు చెందిన వలసదారులు 7.25 లక్షల మంది ఉన్నట్లు అంచనా. వీరిలో 18 వేల మందిని భారత్ కు తరలించేందుకు జాబితా రూపొందించారు. మెక్సికో, సాల్వెడార్ వాసుల తర్వాత అక్రమ వలసదారుల్లో అధికులు భారతీయులే.
మోదీ పర్యటన ముంగిట..
అమెరికాలో అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ భారత ప్రధాని మోదీ పర్యటనకు కొద్దిగా ముందు జరగుతుండడం గమనార్హం.