Begin typing your search above and press return to search.

2,150 కి.మీ... కాలినడకన ఏడుపదుల వయసులో ఏడుకొండలకు..!

సుమారు 2,150 కిలోమీటర్ల దూరంలోని తిరుమలకు కాలినడకన బయలుదేరుతూ... లగేజీ కోసం తోపుడు బండి కూడా తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   1 Nov 2023 1:19 PM GMT
2,150 కి.మీ... కాలినడకన ఏడుపదుల వయసులో ఏడుకొండలకు..!
X

మనసుంటే మార్గం ఉంటుందంటారు.. ఏడు కొండలవాడిని దర్శించుకోవడానికి కాదేదీ ఆటంకం అని చెబుతారు.. శ్రీవారిని దర్శించుకోవాలనే బలమైన సంకల్పం ఉంటే చాలు మిగిలిందంతా ఆయనే చూసుకుంటాడని చెబుతుంటారు భక్తులు..! తాజాగా గుజరాత్ కి చెందిన వృద్ధ దంపతులు తీసుకున్న నిర్ణయం.. చేసిన పని చూస్తే.. ఆశ్చర్యపడక మానరు! పైన చెప్పుకున్నవాటిని గురించి మరోసారి ఆలోచిస్తారు!

అవును... ఏడుకొండల స్వామిని దర్శించుకోవాలనే వృద్ధ దంపతుల సంకల్పం వారిని ఏడుపదుల వయసులో వేలాది కిలోమీటర్ల దూరం నడిపించింది. అనుకున్నట్లుగానే గమ్యస్థానం చేరుకున్నారు. తమ ఆరాధ్యదైవాన్ని దర్శించుకున్నారు. ఈ జన్మ ధన్యమైందన్న స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. తిరిగి కాలినడకన సొంతూరికి బయలుదేరారు!

వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్‌ రాష్ట్రంలోని ద్వారకాకు చెందిన డాక్టర్‌ ఆర్‌.ఉపాధ్యాయ(74), భార్య సరోజినీ (71).. డాక్టరేట్‌ పూర్తి చేశారు. ఇటీవల ఉపాధ్యాయ తల్లి మెడికల్‌ సూపరింటెండెంట్‌ గా పనిచేసి, రిటైరై కొన్నేళ్ల క్రితం కేన్సర్‌ తో చనిపోయారు. అయితే... ఆమెకు జీవితంలో ఒక్కసారైనా తిరుమల వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండేది.

అయితే కేన్సర్‌ వ్యాది కారణంగా శరీరం సహకరించక పోవడంతో ఆమె కోరిక నెరవేరలేదు. అయితే ఆ సమయంలో అత్తగారి బాధను అర్థం చేసుకున్న కోడలు సరోజినీ.. ఆమెకు ఒక హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా... తన భర్త ఉపాధ్యాయతో కలసి కాలినడకన వెళ్లి ఏడుకొండల వాడిని దర్శనం చేసుకుంటామని తెలిపారు. దీంతో ఇటీవల మాట నిలబెట్టుకునే పని మొదలుపెట్టారు.

అత్తగారికి ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపు 70 రోజుల క్రితం గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ నుంచి కాలినడకన తిరుమల కొండకు బయలుదేరారు. సుమారు 2,150 కిలోమీటర్ల దూరంలోని తిరుమలకు కాలినడకన బయలుదేరుతూ... లగేజీ కోసం తోపుడు బండి కూడా తీసుకున్నారు. ఈక్రమంలో బయలుదేరిన 59 రోజుల తర్వాత స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. స్వామివారి దర్శనభాగ్యం లభించిన అనంతరం తిరిగి కాలినడకనే సొంతూరికి తిరుగు పయనమయ్యారు.

ఈ సందర్భంగా స్పందించిన ఉపాధ్యాయ... ఏడు కొండల వాడి దర్శనానికి బయలుదేరే ముందు తన భార్య సరోజినికి కాళ్లవాపుతో పాటు ఆయాసం ఉండేదని, తనకూ గ్లకోమా వ్యాధి ఉండేదని ఉపాధ్యాయ చెబుతున్నారు. అయితే స్వామిపైన భారం వేసి యాత్ర మొదలుపెట్టామని, ఇప్పుడంతా బాగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అతని భార్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమెను తోపుడు బండిపై కూర్చోబెట్టుకుని కొంతదూరం తోసుకుంటూ వెళ్తున్నట్లు ఉపాధ్యాయ చెప్పారు. దీంతో... ఏడు పదుల వయసులో, వేల కిలోమీటర్లు కాలినడకన కొండకు వచ్చి.. మళ్లీ కాలినడకన ఇంటికి చేరాలనే వారి సంకల్పాన్ని చూసిన పలువురు శ్రీవారి భక్తులు ఆశ్చర్యపోతున్నారు.