మరో 'తండేల్'... ఆ 22 మంది భారత జాలర్లకు గుడ్ న్యూస్!
ప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారుల శిక్షా కాలం పూర్తైనప్పటికీ.. పాకిస్థాన్ జైళ్లలోనే మగ్గుతున్నారనే విషయం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Feb 2025 8:00 AM GMTప్రస్తుతం భారతదేశానికి చెందిన సుమారు 180 మంది మత్స్యకారుల శిక్షా కాలం పూర్తైనప్పటికీ.. పాకిస్థాన్ జైళ్లలోనే మగ్గుతున్నారనే విషయం తీవ్ర కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. వారి విడుదలకు పాక్ అధికారులు పలు కారణాలతో ఆలస్యం చేస్తూ వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది!
అవును... శిక్షాకాలం పూర్తైనప్పటికీ పాకిస్థాన్ జైల్లోనే మగ్గుతున్న భారతీయ మత్స్యకారుల విషయం ఇటీవల తెరపైకి వచ్చి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... పాకిస్థాన్ జైలు నుంచి 22 మంది మత్స్యకారులు విడుదలయ్యారు. వారి శిక్షాకాలం పూర్తవ్వడంతో కరాచీలోని మాలిర్ జైలు నుంచి బయటకువచ్చారని తెలుస్తోంది.
వీరందరినీ ఈ రోజు (శనివారం - ఫిబ్రవరి 22) భారత్ కు అప్పగించే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ క్రమంలో... భారత జాలర్ లకు ‘ఈది’ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందించిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా.. వారు కరాచీ నుంచి లాహోర్ కు వెళ్లడానికి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసిందని చెబుతున్నారు.
ఈ సమయంలో ఈది సంస్థే వీరందరికీ ప్రయాణఖర్చులు, కొంత నగదుతో పాటు కొన్ని బహుమతులు అందించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా స్పందించిన ‘ఈది’ ఫౌండేషన్ ఛైర్మన్ ఫైజల్ ఈది... ఎటువంటి దురుద్దేశం లేకుండా అంతర్జాతీయ జలాల సరిహద్దులను పొరపాటున దాటినవారిపై దయతో వ్యవహరించాలని అన్నారు.
ఈ మేరకు ఇరు దేశాల ప్రభుత్వాలను ఆయన అభ్యర్థించారు. ఇక.. ఈ రోజు అన్ని ప్రక్రియలు పూర్తిచేసిన అనంతరం వాఘా సరిహద్దు ద్వారా పాకిస్థాన్ అధికారులు ఈ మత్స్యకారులను భారత్ కు అప్పగిస్తారు. అనంతరం.. వారిని భారత అధికారులు వారి వారి స్వస్థలాలకు పంపిస్తారు.
కాగా... ఈ ఏడాది జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా... పాకిస్థాన్ జైళ్లలో 266 మంది భారత ఖైదీలు ఉండగా.. భారత జైళ్లలో పాకిస్థాన్ ఖైదీలు 462 మంది ఉన్నట్లు చెబుతున్నారు.