Begin typing your search above and press return to search.

‘రాణా’.. భారత్ కు రావాల్సిందే.. ఉగ్ర కుట్రదారుకు అమెరికా కోర్టు షాక్

‘‘నన్ను భారత్ కు అప్పగిస్తే అక్కడ చంపేస్తారు’’.. ఇదీ వందల మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడిలో దోషిగా తేలిన తహవూర్ రానా చెబుతున్న కారణం.

By:  Tupaki Desk   |   7 March 2025 2:42 PM IST
‘రాణా’.. భారత్ కు రావాల్సిందే.. ఉగ్ర కుట్రదారుకు అమెరికా కోర్టు షాక్
X

చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఉగ్రవాద దాడి ఏదంటే 26/11 ముంబై దాడులు. వందల మంది అమాయకులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ దారుణాన్ని తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుస్తుంటుంది. ఇది జరిగి 15 ఏళ్లు దాటుతున్నా.. నిందితులు కొందరు ఇంకా మన దేశం చేతిలోకి రావాల్సి ఉంది. ఇలాంటివారిలో తహవూర్ రాణా ఒకడు. అమెరికాలో ఉంటూ ఇంతకాలం తప్పించుకున్న అతడిని భారత్ కు అప్పగించే సమయం దగ్గరపడింది. కానీ, ఇంతలోనే కోర్టుకెళ్లి తప్పించుకుందామని చూశాడు.

‘‘నన్ను భారత్ కు అప్పగిస్తే అక్కడ చంపేస్తారు’’.. ఇదీ వందల మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడిలో దోషిగా తేలిన తహవూర్ రానా చెబుతున్న కారణం. ఈ మేరకు అతడు భారత్ పై నిందలు వేస్తూ అమెరికా సుప్రీం కోర్టులో కేసు వేశాడు. కానీ, దీనిని సుప్రీం కోర్టు కొట్టివేసింది.

తహవూర్ రానాను అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో అమెరికాను కోరుతోంది. చాలాసార్లు ఈ ప్రక్రియ ముందుకు కదిలినట్లే కదిలి ఆగిపోయింది. ఎట్టకేలకు తాజాగా కదలికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక చేపట్టిన చర్యలు కూడా ఇందుకు కారణం అని భావించవచ్చు. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన సమయంలో.. ‘26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ కు అప్పగిస్తున్నాం’’ అని చెప్పారు. కొన్ని నెలల్లోనే ఈ పని పూర్తవుతుంది అనగా.. తనను అప్పగించొద్దంటూ రానా అమెరికా సుప్రీం కోర్టుకెక్కాడు. అత్యవసర పిటిషన్‌ వేశాడు. తనను భారత్‌ కు పంపిస్తే చిత్రహింసలకు గురిచేస్తారని ఆరోపించాడు.

పాక్ లో పుట్టి.. కెనడాలో స్థిరపడి..

పాకిస్థాన్ మాలాలున్న కెనడా జాతీయుడు తహవూర్‌ రాణా. ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్‌ ఏంజెలెస్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. తనను భారత్‌ కు అప్పగించొద్దంటూ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. అవి తిరస్కరించాయి. శాన్‌ ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌ లోనూ చుక్కెదురైంది. దాంతో నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు. దానిని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ.. 20పేజీల అఫిడవిట్‌ దాఖలు చేసింది. కానీ, సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది.

ముంబై దాడుల మాస్టర్‌ మైండ్‌ డేవిడ్‌ కోల్మన్‌ హెడ్లీ రెక్కీకి రాణా సహకరించాడు. దాడుల బ్లూ ప్రింట్‌ తయారీలో రాణా హస్తం ఉంది ట్రావెల్‌ ఏజెన్సీ నిర్వహిస్తుండగా అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు.. ముంబై దాడి జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్‌బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు.