వైరల్ ఇష్యూ... కొవిడ్ వ్యాక్సిన్ శాస్త్రవేత్తలకు నోబెల్!
ఇక అమెరికాకు చెందిన డ్రూ వెయిస్ మన్, హంగేరీకి చెందిన కాటలిన్ కరికో లు ఇద్దరూ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు.
By: Tupaki Desk | 2 Oct 2023 11:40 AM GMTనోబెల్ బహుమతులకు సంబంధించిన ప్రకటనలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు స్వీడన్ లోని స్టాక్ హోంలో ఉన్న నోబెల్ జ్యూరీ ఈ మేరకు సోమవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ముందుగా వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన వారి పేర్లను వెల్లడించింది. ఈ సమయంలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎం.ఆర్.ఎన్.ఏ. వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పరిశోధనలు చేసిన వారికి ఈ ఏడాదికి నోబెల్ బహుమతి లభించింది.
అవును... ప్రపంచాన్ని గజగజలాడించిన కొవిడ్ ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎం.ఆర్.ఎన్.ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్ మన్ కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం దక్కింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలు.. కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక భూమిక పోషించాయని నోబెల్ జ్యూరీ వెల్లడించింది.
ఇక అమెరికాకు చెందిన డ్రూ వెయిస్ మన్, హంగేరీకి చెందిన కాటలిన్ కరికో లు ఇద్దరూ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో కలిసి పరిశోధనలు జరిపారు. ఈ క్రమంలోనే ఎం.ఆర్.ఎన్.ఏ వ్యాక్సిన్లను శరీర కణాల్లోకి పంపినప్పుడు.. అవి ప్రతిచర్యను అడ్డుకోవడంతో పాటు, శరీరంలో ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతాయని తమ పరిశోధనలో గుర్తించారు. దీంతో 2005లో ఈ పరిశోధనా ఫలితాలపై ఓ పేపర్ ను కూడా పబ్లిష్ చేశారు.
అయితే అది అప్పట్లో అంతగా గుర్తింపు పొందలేదు. కానీ.. కొవిడ్ - 19 పాండమిక్ సమయంలో వ్యాక్సిన్ల అభివృద్ధిలో మాత్రం వీరి పరిశోధనలు కీలక భూమిక పోషించాయి. వీరి పరిశోధనలవల్లే 2020లో రెండు ఎం.ఆర్.ఎన్.ఏ. వ్యాక్సిన్లకు ప్రభుత్వాల నుంచి ఆమోదం లభించింది. ఆ వ్యాక్సిన్లు వైరస్ వ్యాప్తిని నిరోధించడమే గాక.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాయి. ఇదే విషయాన్ని నోబెల్ బృందం వెల్లడించింది.
కాగా... స్వీడన్ కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే. 1896వ సంవత్సరంలో ఆల్ ఫ్రెడ్ నోబెల్ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.
ఇందులో భాగంగా గతేడాది ఈ అవార్డు గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ల నగదు బహుమతిగా అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్లకు పెంచారు. స్వీడిష్ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేస్తారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే... 1 స్వీడిష్ క్రోనర్ విలువ సుమారు ఏడున్నర రూపాయలు!