3 గంటలు లేట్ అయితే ఫ్లైట్ రద్దు చేయండి
విమాన సర్వీసుల ఆలస్యంపై తగిన నిర్ణయం తీసుకోవటానికి వీలుగా తాజాగా చేసిన సూచన ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 2 Jan 2025 4:44 AM GMTకొత్త సంవత్సరం వేళ.. సరికొత్త సూచన చేసింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. విమాన సర్వీసుల ఆలస్యంపై తగిన నిర్ణయం తీసుకోవటానికి వీలుగా తాజాగా చేసిన సూచన ఆసక్తికరంగా మారింది. ఆధ్వాన వాతావరణ పరస్థితుల్లో.. ముఖ్యంగా మంచు ఎక్కువగా ఉన్న సమయాల్లో విమానయాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని.. తమ కార్యకలాపాల నియంత్రణ కేంద్రాల్ని మరింత బలోపేతం చేయాల్సిందిగా పేర్కొంది.
మూడు గంటలకు మించి ఆలస్యమైతే విమాన సర్వీసుల్ని రద్దు చేయాల్సిందిగా సూచన చేసింది. గడిచిన రెండు నెలలుగా విమానయాన సంస్థలు.. విమానాశ్రయ ఆపరేటర్లతో మంత్రిత్వశాఖ వరుస చర్చల అనంతరం తాజా మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం మూడు గంటలకు మించి ఆలస్యమైతే .. విమాన సర్వీసు రద్దు.. ఆలస్యమైన విమానం లోపల ప్రయాణికుల్ని 90 నిమిషాల కంటే ఎక్కువగా కూర్చోపెట్టరాదని పేర్కొంది.
ఈ కారణంగా వారికి ఎదురయ్యే అసౌకర్యాన్ని తగ్గించొచ్చని పేర్కొంది. అంతేకాదు.. అలాంటి సందర్భాల్లో రీబోర్డింగ్ ప్రక్రియ సులువుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. మంచు బారిన ఎయిర్ పోర్టుల్లో సమర్థంగా సేవల్ని అందించేందుకు వీలుగా క్యాట్ 2 .. క్యాట్ 3 సిబ్బందిని సరిపడేలా నియమించుకోవాలని కోరింది.
అంతేకాదు. విమాన ప్రయాణికులతో విమానయాన సంస్థలు సర్వీసు ఆలస్యం గురించి.. రద్దు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.