Begin typing your search above and press return to search.

కుంభమేళా అలెర్టు: 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ లు!

ఆదివారం ఒక్క రోజులో సాయంత్రానికి ఒకటిన్నర కోట్ల మంది భక్తులు ప్రయోగ్ రాజ్ కు చేరుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 4:17 AM GMT
కుంభమేళా అలెర్టు: 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ లు!
X

మహా కుంభమేళా మొదలై దగ్గర దగ్గర నెల రోజులు కావొస్తోంది. సరిగ్గా చెప్పాలంటే 29 రోజులు. మరికొద్ది రోజులు మాత్రమే సాగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి దేశ విదేశాల నుంచి కోట్లాది మంది ప్రయోగ్ రాజ్ దారిన పడుతున్నారు. ప్రముఖులు.. సెలబ్రిటీలు.. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మహా కుంభమేళాకు హాజరు కావటం ద్వారా జీవితకాల అనుభవాన్ని సొంతం చేసుకోవటానికి తపిస్తున్నారు. దీంతో.. కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఆదివారం ఒక్క రోజులో సాయంత్రానికి ఒకటిన్నర కోట్ల మంది భక్తులు ప్రయోగ్ రాజ్ కు చేరుకున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కనుచూపు మేర జనసంద్రంతో ఆ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఇదిలా ఉండగా.. మహా కుంభమేళా కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి వెళ్లే భక్తులతో ఆయా రహదారులు భారీగా బారులు చేరుతున్న పరిస్థితి. దీంతో.. ప్రయాగ్ రాజ్ చేరుకునే అన్ని మర్గాలు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి.

ఎడతెరపి లేకుండా వస్తున్న వాహన సముదాయంతో ఆయా రహదారులు భారీ ట్రాఫిక్ జాంలు ఎదుర్కొంటున్నాయి. ఆదివారం ఒక్క రోజునే సుమారు 200 - 300 కి.మీ. మేర ట్రాఫిక్ జామ్ అయిన విషయాన్ని చెబుతున్నారు. దీంతో.. గంటల కొద్దీ భక్తులు తమ వాహనాల్లో రోడ్ల మీదనే ఉండిపోవాల్సిన పరిస్థితి. కుంభమేళాకు పోటెత్తుతున్న భక్తుల్ని.. వారి వాహనాల్ని క్రమపద్దతిలో పంపే విషయంలో పోలీసులు కిందా మీదా పడుతున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా మధ్యప్రదేశ్ లోనే వేలాది వాహనాల్ని ఆపేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ నుంచి అధికారుల క్లియరెన్సు తర్వాత మాత్రమే మధ్యప్రదేశ్ నుంచి వాహనాల్ని అనుమతిస్తామని చెప్పటం చూస్తే.. కుంభమేళాకు జనవరద ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ప్రయాగ్ రాజ్ - కాన్పూరు, ప్రయాగ్ రాజ్ - లక్నో, ప్రయాగ్ రాజ్ - వారణాసి - మిర్జాపుర్, ప్రయాగ్ రాజ్ - రేవా వెళ్లే నేషనల్ హైవేల్లో మూడు రోజులుగా తీవ్రమైన రద్దీ కొనసాగుతోంది. పలువురు ప్రయాణికులు మీడియాతో మాట్లాడుతూ.. 48 గంటలుగా ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయిన విషయాన్ని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాగ్ రాజ్ కు వెళ్లే భక్తులు ఎవరైనా సరే.. రియల్ టైంలోని పరిస్థితుల గురించి సమాచారాన్ని పక్కాగా సేకరించిన తర్వాతే ప్లాన్ చేసుకోవటం మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.