రూ.4 బిర్యానీ.. ఆఫర్ తర్వాత నర్సిపట్నంలో ఏమైంది?
అదరగొట్టే ఆఫర్ రావాలే కానీ.. దాన్ని సొంతం చేసుకోవటానికి ఎంతలా ట్రై చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
By: Tupaki Desk | 16 Dec 2024 5:21 AM GMTఅదరగొట్టే ఆఫర్ రావాలే కానీ.. దాన్ని సొంతం చేసుకోవటానికి ఎంతలా ట్రై చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటిదే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని నర్సీపట్నంలో చోటు చేసుకుంది. కేవలం నాలుగు రూపాయిలకే చికెన్ బిర్యానీ ఇస్తామని.. అది కూడా కేవలం రెండు గంటలు మాత్రమే అంటూ చేసిన ప్రచారంతో వేలాది మంది పోటెత్తారు. అంతేకాదు.. ఒకరికి ఒక చికెన్ బిర్యానీ మాత్రమే ఇస్తానని ప్రకటించటంతో.. ఆ అద్భుత ఆఫర్ ను సొంతం చేసుకోవటానికి మిగిలిన పనులన్నీ వదిలేసుకొని.. బిర్యానీ సెంటర్ వద్ద గంటల తరబడి నిలిచిన వైనం చూస్తే.. ఔరా అనుకోవాల్సిందే.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ‘అన్ లిమిటెడ్ మల్టీక్యూజెన్ రెస్టారెంట్’ పేరుతో డిసెంబరు 15న ఒక రెస్టారెంట్ ను ప్రారంభించారు. నర్సీపట్నం బస్టాండ్ సమీపంలో స్టార్ట్ చేసిన ఈ రెస్టారెంట్ ను ప్రమోషన్ చేసేందుకు దాని నిర్వాహకులు అదిరే ఆఫర్ ను ప్రకటించారు. రూ.4లకే చికెన్ బిర్యానీ అంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు.
రెస్టారెంట్ ఓపెనింగ్ నేపథ్యంలో ఈ అదిరే ఆఫర్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. అంచనాలకు తగ్గట్లే.. మిగిలిన పనులన్నీ వదిలేసుకొని.. ఉదయాన్నే ఈ రెస్టారెంట్ వద్దకు జనాలు పోటెత్తారు. గంటల ముందే రెస్టారెంట్ వద్దకు చేరుకున్న బిర్యానీ ప్రియులు.. తమ పిల్లల్ని..కుటుంబ సభ్యుల్ని వెంట పెట్టుకురావటం గమనార్హం. రెస్టారెంట్ వైపు వెళుతూ.. ఆఫర్ గురించి తెలుసుకున్న వాహనదారులు సైతం తమ ప్రయాణాన్ని పక్కన పెట్టేసి.. క్యూలైన్ లో చేరిపోయారు.
దీంతో రెస్టారెంట్ చుట్టుపక్కల ప్రాంతాలన్ని జనాలతో నిండాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ హడావుడి గురించి తెలుసుకున్న పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. క్యూలైన్లను ఏర్పాటు చేయటం.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కట్ చేస్తే.. నిర్వాహకులు పేర్కొన్న 2 గంటల వ్యవధిలో ఏకంగా3వేల మందికి తాము చికెన్ బిర్యానీని రూ.నాలుగుకే అందజేసినట్లు చెబుతున్నారు.చికెన్ బిర్యానీనా మజాకానా?