వారంలో నాలుగు రోజులే పని ఉద్యోగులకు బంపర్ ఆఫర్
నూతన సంవత్సరం సందర్భంగా ఈ నాలుగు రోజుల పని నిబంధన అమల్లోకి తేవాలని నిర్ణయించుకుంది.
By: Tupaki Desk | 4 Jan 2025 11:30 AM GMTవారంలో నాలుగు రోజులు మాత్రమే పని. మిగిలిన మూడు రోజులు భార్యతో కలిసి ఎంజాయ్ చేయమంటూ జపాన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఆఫర్ ప్రకటించింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ నాలుగు రోజుల పని నిబంధన అమల్లోకి తేవాలని నిర్ణయించుకుంది.
మన దేశంలో వారానికి ఆరు రోజులు పనిచేయమని, రోజుకు 12 గంటలు పనిచేయమని కంపెనీలు ఉద్యోగులను కోరుతుంటే.. జపానులో మాత్రం అందుకు విరుద్ధంగా ఉద్యోగులు వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇలా వారంలో నాలుగు రోజులే పనిచేయమని చెప్పడానికి కూడా ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది.
జపానులో పడిపోతున్న జననాల రేటును అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారంలో నాలుగు రోజులు పనిచేయడంతో పాటు మరికొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వచ్చే నిబంధనలు ప్రకారం ఉద్యోగులు మూడు రోజుల సెలవులో పిల్లలను కనడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని టోక్యో గవర్నర్ యురికో కొయికే కోరారు. జపానులో అధిక పనిదినాల వల్ల ఒత్తిడి పెరిగిపోయి దంపతుల ఏకాంత సమయం తగ్గిపోయిందని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. ఉద్యోగం, కుటుంబం మధ్య నలిగిపోతున్న ప్రజలు ఎక్కువగా ఉద్యోగానికే ప్రాధాన్యమివ్వడం వల్ల సంతానం ఆలోచనను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారట. దీనివల్ల దేశ జనాభా బాగా తగ్గిపోవడమే కాకుండా సీనియర్ సిటిజన్ల రేటు విపరీతంగా పెరిగిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మూడు రోజులు సెలువులిస్తే దంపతులు విరివిగా కలుసుకునేందుకు, పిల్లలను కనేందుకు ఆలోచిస్తారని టోక్యో ప్రభుత్వం భావిస్తోంది. అలాగే చిన్నపిల్లలు ఉన్న దంపతులు తమ జీతంలో కొంత భాగం వదులుకునే ప్రాతిపదికన తోటి ఉద్యోగులతో అవగాహనకు వచ్చి కాస్త ముందుగానే ఆపీసు నుంచి బయటపడే అవకాశం కూడా కల్పించాలని నిర్ణయించారు. మొత్తానికి ఆసక్తికరంగా మారిన జపాన్ నిర్ణయం ఆ దేశ జనాభా పెరుగుదలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచిచూడాలి.