Begin typing your search above and press return to search.

కాసుల కక్కుర్తి.. బోటుకు రూ.40వేలు.. ట్రాక్టర్ పై తీసుకొచ్చేందుకు రూ.2వేలు

ముంపు ప్రాంతాల నుంచి బయటకుతెచ్చేందుకు.. అది కూడా ఒకటిన్నర కిలోమీటర్ కు ఒక్కో కుటుంబం నుంచి ప్రైవేటు బోటు ఆపరేటర్లు వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   3 Sep 2024 4:45 AM GMT
కాసుల కక్కుర్తి.. బోటుకు రూ.40వేలు.. ట్రాక్టర్ పై తీసుకొచ్చేందుకు రూ.2వేలు
X

కష్టంలో చిక్కుకొని విలవిలలాడే వేళలో అపన్నహస్తం అందించాల్సింది పోయి.. కాసుల కక్కుర్తితో వ్యవహరించిన తీరు చూస్తే.. షాకింగ్ గా అనిపించక మానదు. విజయవాడలో విరుచుకుపడిన వరద పోటు వేళ.. వరదలో చిక్కుకుపోయిన వారు.. తమనుసురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా ప్రైవేటు బోట్లు.. ట్రాక్టర్లను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా డబ్బులు దోచేసిన తీరు చూస్తే.. మరీ ఇంత దారుణమా? అన్న భావన కలుగక మానదు. వరద విలయంలో విలవిలలాడుతున్న బాధితులను బయటకు తీసుకురావటానికి ప్రైవేటు బోటు ఆపరేటర్లు వసూలు చేసినడబ్బుల గురించి తెలిస్తే నోటమాట రాదంతే.

ముంపు ప్రాంతాల నుంచి బయటకుతెచ్చేందుకు.. అది కూడా ఒకటిన్నర కిలోమీటర్ కు ఒక్కో కుటుంబం నుంచి ప్రైవేటు బోటు ఆపరేటర్లు వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.40వేలు. అదే ట్రాక్టర్లలో బయటకు తీసుకొచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేశారు. విజయవాడలోని వన్ టౌన్ లోని భవానీపురం.. చర్చి సెంటర్ నుంచి జోజి నగర్ వైపు వెళ్లే రాదారి.. స్వాతి థియేటర్ వైపు వెళ్లే రోడ్లు.. ఆ ప్రాంతాలన్ని వరద నీటిలో మునిగిపోయాయి.

గడిచిన రెండు రోజులుగా అక్కడ వరద పోటు తగ్గలేదు.. విద్యుత్ సౌకర్యం లేదు. దీంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే పీకల్లోతు నీటిలో నడవాల్సి ఉంది. అయితే.. ఇక్కడ ఉన్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం బోట్లను ఏర్పాటు చేసింది. అయితే.. కింది స్థాయి అధికారుల పుణ్యమా అని.. అవి బాధితుల వద్దకు చేరుకోలేదు.

దీంతో.. ప్రైవేటు బోటు ఆపరేటర్లు.. ట్రాక్టర్ యజమానులు దోపిడీకి తెర తీశారు. ఒక అపార్ట్ మెంట్ లో చిక్కుకున్న కుటుంబాన్ని బోటులో బయటకు తీసుకురావటానికి ఒక ప్రైవేటు ఆపరేటర్ ఏకంగా రూ.40వేలు వసూలు చేసిన వైనం వింటే నోటి వెంట మాట రాదంతే. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు ఎక్కి వరద వెలుపులకు వచ్చేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.2 వేలు చొప్పున వసూలు చేస్తున్నారు.

వరదలో చిక్కుకుపోయిన బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆహార పొట్లాలు.. పాలు.. మంచినీళ్లు.. పండ్లు లాంటివి సిద్ధం చేసి.. లారీలు.. ట్రాక్టర్లలో ముంపు ప్రాంతాలకు తరలించారు.కానీ.. అక్కడి నుంచి బాధితులు ఉన్న ప్రాంతాలకు చేరవేసేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేయని పరిస్థితి. ఇంట్లో యువకులు ఉంటే బయటకు వచ్చి తీసుకుంటున్నారుకానీ పెద్ద వయస్కుల వారు.. మహిళలు మాత్రం ఇంటి బయటకు రాలేక తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితి. ఈ అంశాలపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.