ఇకపై సెక్షన్ 420 కాదు..సెక్షన్ 318
సెక్షన్ 420...ఈ పేరు చెప్పగానే ఇండియన్ పీనల్ కోడ్ గుర్తుకు వస్తుంది. చీటింగ్ కేసు పెట్టేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది.
By: Tupaki Desk | 2 July 2024 4:15 AM GMTసెక్షన్ 420...ఈ పేరు చెప్పగానే ఇండియన్ పీనల్ కోడ్ గుర్తుకు వస్తుంది. చీటింగ్ కేసు పెట్టేందుకు ఈ సెక్షన్ ఉపయోగపడుతుంది. లా తెలియని వారు కూడా ఈ సెక్షన్ నంబరు గుర్తు పెట్టుకుంటారు.ఇక, దర్శకనిర్మాతలైతే ఆ 420ని ఉపయోగించుకొని ఏకంగా సినిమాలే తీశారు. శ్రీ 420, చాచీ 420 అనే బాలీవుడ్ సినిమాలు ఆ నంబర్ తో వచ్చాయి. ఇక, రాజకీయ నాయకులైతే ఈ సెక్షన్ 420ని విపరీతంగా వాడేస్తుంటారు. ఆ ముఖ్యమంత్రి ఓ 420 అని విమర్శిస్తుంటారు. అయితే, ఇకపై వారికి ఆ అవకాశం లేదు.
ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్రకారం సెక్షన్ 420 మోసం లేదా దొంగతనం నేరం గురించి చెబుతోంది. అయితే, భారతీయ శిక్షా స్మృతిలో కొన్ని మార్పుల చేసి కొత్త చట్టాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో, ఇకపై సెక్షన్ 420ని 318 నెంబర్ భర్తీ చేయనుంది. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో ఈ రోజు నుంచి భారతీయ న్యాయ సంహిత(BNS) 2023 చట్టం అమలులోకి వచ్చింది. నేరాలు, వాటికి వేసే శిక్షలతోపాటు సెక్షన్లలోనూ మార్పులు వచ్చాయి.
ఇకపై పోలీసులు 420కి బదులు 318 సెక్షన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దాంతోపాటు, దేశ ద్రోహం సెక్షన్ 124A నుంచి 152కి మారింది. ఇక, పరువు నష్టం వ్యవహారంలో సెక్షన్ 499కి బదులు సెక్షన్ 356 కింద కేసు పెట్టాల్సి ఉంటుంది. అలాగే, అత్యాచార నేరం చట్టం సెక్షన్ 375 నుంచి 63కి, గ్యాంగ్ రేప్ సెక్షన్ 376 డీ ని తీసి వేసి దానిని సెక్షన్ 70(1) పరిధిలోకి తీసుకువచ్చారు. మర్డర్ కేసు సెక్షన్ 302ను సెక్షన్ 103 పరిధిలోకి తీసుకువచ్చారు. ఏదేమైనా కొత్త సెక్షన్ల నంబర్లు, శిక్షల గురించి అందరికీ అవగాహన రావడానికి సమయం పడుతుంది.