ఈ ఐదింటిని ఫాలో అవుతున్నారా? మీ విజయాల్ని ఆపలేరు
జీవితంలో గెలుపు సాధించాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సింఫుల్ సమాధానం ఒప్పులు చేయకున్నా ఫర్లేదు కానీ తప్పులు చేయొద్దని.
By: Tupaki Desk | 17 Feb 2025 2:00 PM ISTజీవితంలో గెలుపు సాధించాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సింఫుల్ సమాధానం ఒప్పులు చేయకున్నా ఫర్లేదు కానీ తప్పులు చేయొద్దని. నిజమే..ఏం చేయకూడదో తెలిస్తే.. ఏం చేయాలో ఆటోమేటిక్ గా అర్థమవుతుంది కదా? ఇదే విషయాన్ని కొందరు ప్రముఖులు తమదైన శైలిలో చెప్పటం.. వాటిని చదివినంతనే మనసుకు అర్థమవ్వాల్సిందంతా అర్థమయ్యేలా ఉండటం వీరి మాటల ప్రత్యేకత. ఇంతకూ ఈ ఐదు సూత్రాలేంటి? ఆ చెప్పినోళ్లు ఎవరన్నది చూస్తే..
కోపం.. ద్వేషించే గుణాలకు మించిన మైనస్ పాయింట్లు ఎవరికి ఉండదు. ఇదెంత తప్పు అన్న విషయాన్ని ప్రముఖ పాడ్ కాస్టర్ జో రోగన్ చెబుతారు. ఆయన మాటల్లో చదివితే.. ‘‘ఎవరినైనా మీరు ద్వేషిస్తున్నారంటే.. మీకు మీరు హాని చేసుకుంటున్నట్లే. ఎందుకంటే మీరు మీ గురించి కంటే వారి గురించే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు. దీనివల్ల మీ పురోగతి కోసం వెచ్చించాల్సిన విలువైన టైంను కోల్పోతారు. దీనికి తోడు ద్వేషమనే భావన మనశ్శాంతిని హరిస్తుంది. అందుకే.. ఎవరి మీదనైనా కోపం వస్తే వారిని ద్వేషిస్తూ కూర్చోకండి. ఆ విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది’’ అని ఆయన సలహా ఇస్తారు. నిజమే కదా?
చేసే పని ఏదైనా సరే.. దాన్ని మరింత బాధ్యతగా చేస్తే వచ్చే ఫలితం వేరుగా ఉంటుంది. నిజానికి ఏ వయసు వారైనా.. వారు చేసే పనికి సంబంధించి కీలకమైన ఒక సూత్రాన్ని మిస్ అవుతుంటారు. ఆ పాయింట్ ను ఎంత చక్కగా చెప్పారో వ్యాపారవేత్త హర్ష్ మారీవాలా. గుజరాత్ కు చెందిన ఈ బిజినెస్ టైకూన్.. ఫార్చ్యూన్ ఇండియా 500 కంపెనీలో ఒకటైన మారికో వ్యవస్థాపకుడే కాదు ఛైర్మన్ కూడా. ఈయన చెప్పేదేమంటే.. ‘‘కెరీర్ లోఉన్నత స్థాయికి ఎదగాలంటే మీరు ఉద్యోగిలా పని చేయొద్దు. ఒక నాయకుడిలా ఆలోచించాలి. మీకు అప్పగించిన పనిని చేయటం వరకే పరిమితం కాకుండా అవసరమైన అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందించాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. పనులు పూర్తయ్యేలా చూడటం బాధ్యతగా తీసుకోవాలి’ అని చెబుతారు. ఉద్యోగి కాస్తా సారధిలా వ్యవహరించానికి మించిన గొప్ప గుణం ఏముంటుంది? ఎవరు మాత్రం గుర్తించకుండా ఉంటారు?
ఒక సామాన్యుడికి.. ప్రముఖుడికి మధ్య ఉండే వ్యత్యాసం ఏమిటి? మామూలుగా ఉండే వారికి గొప్పోళ్లకు మధ్య ఉండే తేడా ఏంటి? వారికి ఉండే గుణం ఏమిటో ఆసక్తికరంగా చెబుతారు ప్రముఖ వ్యాపారవేత్త మోతీలాల్ ఓస్వాల్. ఫైనాన్షియల్ సర్వీసెస్ కు పెట్టింది పేరుగా ఉండే ఆయన మాటలకు ఉండే విలువ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏమంటారంటే? ‘‘మామూలు మనుషుల్ని గొప్పవారిగా మార్చే అద్భుత శక్తి.. సమస్యల్ని అవకాశాలుగా చూడటం. జీవితం సాఫీగా సాగుతుంటే మెదడుకు పదును పెట్టం. కానీ.. సమస్యలు ఎదురైనప్పుడు దాని నుంచి బయట పడేందుకు దారులు వెతుకుతాం. ఆ ప్రయత్నంలో వినూత్నంగా ఆలోచిస్తాం. ఇది మనలోని శక్తిసామర్థ్యాల్ని పూర్తిస్థాయిలో బయటకు తీస్తాం. అవే.. మనల్ని విజేతలుగా మారుస్తాయి. అందుకే.. సమస్యల్ని కష్టాలుగా కాకుండా అవకాశాలుగా చూడండి’’ అని చెబుతారు. దేవుడ్ని ప్రార్థించేటప్పుడు సమస్యల్ని ఇవ్వాలని కోరుకుంటే..? కాస్త తేడా ఉన్నా.. ఆ ఆత్మవిశ్వాసం మీలో మారిన వ్యక్తిని మీకే చూపిస్తుంది కదా?
ఏదైనా కొత్త పని చెప్పినంతనే.. టైం సరిపోవట్లేదన్న మాట వినిపిస్తుంది. అంతేకాదు.. ముఖ్యమైన వారిని కలిసినప్పుడు కూడా.. కాస్తంత బిజీగా ఉండటంతో కలవలేదన్న మాటను చెప్పటం చూస్తాం. ఆ మాటకు వస్తే.. మనం కూడా అలాంటి మాటలు చాలామందితో అంటుంటాం. కానీ.. అది నిజమా? అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటే అదెంత తప్పు అన్నది ఇట్టే అర్థమవుతుంది. ఇదే విషయాన్ని తనదైన మాటలతో చెప్పి.. మనలో కొత్త ఆలోచనలకు తెర తీస్తారు ప్రముఖ హెల్త్ కోచ్ జానీ బ్రౌన్. అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్ కోచ్ లలో అతను ఒకరు.
ఆరోగ్యకర జీవితం చాలా సులువుగా చెబుతారు. అదెలా అన్న ఆశ్చర్యమా? అయితే.. ఆయనేం చెప్పారో చదువుదాం.. ‘‘రోజూ 8 గంటలు నిద్రపోవటం కష్టమా? ఫోన్ చూడటం ఆపేస్తే అది సులువే. ఉదయాన్నే అరగంట సేపు నడవటానికి ఇబ్బందేంటి? ఒంటికి సూర్యరశ్మి తగిలేలా ఎండలో గడిపితే ఏమన్నా ఖర్చు అవుతుందా? ఆరోగ్యం కోసం పోషకాహారం.. తగినంత మోతాదులో నీటిని తీసుకోవటం ఎందుకు కుదరదు?’’ ఈ ప్రశ్నలు వేసుకంటే..మనలో మార్పు ఖాయం కదూ? చాలామందికి ఆలోచనలు రావన్న ఫిర్యాదు చేస్తారు. నిజంగా ఆలోచనలు రావటం తప్పా? అంటే.. అవునని చెప్పలేం. కొన్నిసార్లు ఆలోచించకపోవటం కూడా దీనికి కారణం కావొచ్చు.
ఇక్కడో విషయాన్ని చెప్పాలి. కొత్త ఆలోచనలు రాకున్నా ఫర్లేదు.. వచ్చిన ఆలోచనల్ని సమర్థంగా చేస్తే చాలు.. విజయం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇదే విషయాన్ని బిజినెస్ గ్రోత్ మెంటార్ గా పేరున్న జాన్ బ్రొసియో చెప్పేది వింటే నిజమే కదా? అనిపిస్తుంది. ఆయనేమంటారంటే.. ‘‘ఆలోచన కొత్తది కాకున్నా దాన్ని సమర్థంగా అమలు చేస్తే సక్సెస్ తథ్యం. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఫేస్ బుక్ మొట్టమొదటి సోషల్ మీడియా కాదు. కానీ.. అది కాస్తా దిగ్గజంగా ఎదిగింది. గూగుల్ తొలి సెర్చ్ ఇంజిన్ కాదు కానీ బ్రౌజింగ్ కు పర్యాయపదంగా మారింది. స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది యాపిల్ కాదు. కానీ.. ఐఫోన్ తో సంచలనానికి తెర తీసింది’ అంటూ పలు ఉదాహరణలు చెబుతారు. ఈ ఐదుగురు చెప్పిన విషయాన్ని ఒకటికి రెండుసార్లు గుర్తు తెచ్చుకున్నా.. వారు చెప్పిన దిశగా ఆలోచించినా.. మార్పు మాత్రమే కాదు.. జీవితంలో కొత్త వెలుగులు ఖాయమని చెప్పక తప్పదు.