5జీ స్పెక్ట్రమ్.. మళ్లీ అదే టాప్!
5జీ సర్వీసుల కోసం జూన్ 25న ప్రారంభమైన పదో విడత స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. మొత్తం ఎనిమిది బ్యాండ్ల లో కేంద్ర ప్రభుత్వం ఈ వేలం నిర్వహించింది
By: Tupaki Desk | 26 Jun 2024 12:21 PM GMT5జీ సర్వీసుల కోసం జూన్ 25న ప్రారంభమైన పదో విడత స్పెక్ట్రమ్ వేలం ముగిసింది. మొత్తం ఎనిమిది బ్యాండ్ల లో కేంద్ర ప్రభుత్వం ఈ వేలం నిర్వహించింది. మొత్తం రూ.96,317 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ కోసం టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఈ వేలంలో పాల్గొన్నాయి.
అయితే గతంతో పోలిస్తే ఈసారి 5జీ స్పెక్రమ్ వేలంకు కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపలేదు. వాటి దగ్గర ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు.
ఈ నేపథ్యంలో 5జీ స్పెక్ట్రమ్ కోసం కేంద్ర ప్రభుత్వానికి 2022తో పోలిస్తే ఈసారి కంపెనీలు చేసిన ముందస్తు డిపాజిట్ల మొత్తం తక్కువే. 2022లో జరిగిన వేలంతో పోలిస్తే ఈసారి కంపెనీలు 79–86 శాతం తక్కువగా ముందస్తు డిపాజిట్లు చేశాయి.
కాగా ఈసారి వేలం లో కూడా రిలయన్స్ జియో టాప్ బిడ్డర్ గా నిలిచింది. కీలకమైన 5జీ మొబైల్ సర్వీసులను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు టెలికాం కంపెనీలు ఈ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్ సర్వీసుల కోసం ఎనిమిది బ్యాండ్లలో వేలం వేయనున్న స్పెక్ట్ర మ్ బేస్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.96,317 కోట్లుగా ఖరారు చేసింది.
పదో విడత స్పెక్ట్రమ్ వేలంలో 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగా హెట్జ్‌తో పాటు 26 గిగా హెట్జ్ బ్యాండ్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఈ వేలం కోసం రిలయన్స్ జియో ఇప్పటికే బయానా (ముందస్తు నగదు డిపాజిట్ గా)గా రూ.3,000 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్లు కేంద్రానికి చెల్లించాయి.
ఈ వేలంలో.. 800 ఎంహెచ్ జెడ్ నుండి 26 జీహెచ్ జెడ్ వరకు ఫ్రీక్వెన్సీలను కవర్ చేస్తూ మొత్తం 10 జీహెచ్ జెడ్ రేడియో తరంగాలను కొనుగోలుకు కేంద్రం అందుబాటులో ఉంచింది. జూలై 2022లో జరిగిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో అందుబాటులోకి వచ్చిన 72 జీహెచ్ జెడ్ కంటే ప్రస్తుత వేలం ఆఫర్ చాలా తక్కువే.
ఆగస్ట్ 2022లో జరిగిన చివరి స్పెక్ట్రమ్ వేలంలో ప్రభుత్వం రూ. 1.5 లక్షల కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సేవల కోసం ఎనిమిది స్పెక్ట్రమ్ బ్యాండ్ లను సుమారు రూ. 96,317 కోట్ల బేస్ ధరకు అందుబాటులో ఉంచింది. ఈ 10వ వేలంలో 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగా హెట్జ్‌తో పాటు 26 గిగా హెట్జ్ బ్యాండ్ అందుబాటులో ఉన్నాయి.
అయితే వేలం గతంలో పోలిస్తే పరిమితంగానే ఉంది. జియో, ఎయిర్‌టెల్ వోడాఫోన్ ఇప్పటికే తగినంత 5 జి స్పెక్ట్రం హోల్డింగ్ లను కలిగి ఉన్నాయి. అదనంగా కొత్తగా వినియోగదారులు వచ్చే అవకాశాలు లేకపోవడం వల్ల 5జీ స్ప్రెక్టమ్ వేలంలో ఎక్కువ మొత్తాన్ని కొనుగోలు చేయలేదని తెలుస్తోంది.
కేవలం రెండ్రోజుల్లోనే వేలం ముగిసింది. 12 శాతం స్పెక్ట్రానికి మాత్రమే కంపెనీలు బిడ్డింగులు దాఖలు చేశాయి. తొలిరోజు ఐదు రౌండ్ల బిడ్డింగ్‌లో రూ.11,340 విలువైన బిడ్లను టెలికాం కంపెనీలు సమర్పించాయి. రెండో రోజు ఎలాంటి బిడ్లూ దాఖలు కాలేదు. దీంతో ఉదయం 11.30 గంటలకే వేలం ముగిసినట్లు అధికారులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో వేలం ద్వారా రూ.11 వేల కోట్లు మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. 2022లో చివరిసారిగా నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం వారంపాటు జరిగింది. నాడు మొత్తం రూ.1.5 లక్షల కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ను కంపెనీలు దక్కించుకున్నాయి. ఇందులో అప్పుడు జియోనే అత్యధిక స్పెక్ట్రమ్ ను సొంతం చేసుకుంది. సుమారు రూ.88,078 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ ను ఆ కంపెనీ దక్కించుకుంది.