2 గంటల్లో 61 వేల పిడుగులు...షాకింగ్
2 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 61 వేల పిడుగులు పడడంతో 12 మంది మృత్యువాతపడ్డారు.
By: Tupaki Desk | 4 Sep 2023 12:32 PM GMTప్రస్తుతం భారతదేశంలోని పలు రాష్ట్రాలలో వర్షాలతో జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల ఉపరితల ఆవర్తనాలు, కొన్నిచోట్ల అల్పపీడనాలు, మరికొన్ని చోట్ల వాయుగుండాలతో దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షపాతాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతాలైనటువంటి ఒరిస్సా రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఒడిసాలో కురుస్తున్న వర్షాల కారణంగా అక్కడ రికార్డు స్థాయిలో పిడుగులు పడిన వైనం చర్చనీయాంశమైంది. 2 గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 61 వేల పిడుగులు పడడంతో 12 మంది మృత్యువాతపడ్డారు. పిడుగుపాటుకు గురై 14 మంది గాయపడ్డారని ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సాహూ వెల్లడించారు.
సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం 48 గంటలలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2 గంటల వ్యవధిలో 61 వేల పిడుగులు పడినటువంటి అసాధారణ పరిస్థితి ఎప్పుడూ లేదని సాహు వెల్లడించారు. ఇక, మరో వారం పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భువనేశ్వర్ తో పాటు పలు ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఈ పిడుగుపాటుకు గురై గజపతి, జగత్ సింగ్పూర్, పూరి, బలంగిర్ తదితర జిల్లాల్లో 12 మంది మరణించినట్టుగా అధికారులు వెల్లడించారు. ఇక, వందల సంఖ్యలో పశువులు కూడా మృత్యువాత పడ్డాయని చెప్పారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందజేయబోతున్నామని సాహు ప్రకటించారు. చాలా విరామం తర్వాత ఋతుపవనాలు సాధారణ స్థితికి వచ్చాయని, అటువంటి సందర్భంలో పిడుగులు, మెరుపులు విరుచుకుపడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.