రూ.800, రూ.900 నాణేలు... ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
ఈ రెండూ నాణేలను ఫిబ్రవరి 20న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.
By: Tupaki Desk | 13 March 2025 6:03 PMదేశంలో తొలిసారిగా విడుదలైన రూ.800, రూ.900 నాణేల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది! ఈ క్రమంలో ఈ నాణేలు ప్రస్తుతం ఏపీకి చెందిన ఓ వ్యక్తి దగ్గర ఉన్నాయి. ఇందులో భాగంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ ఈ నాణేలను తెప్పించుకున్నారు. వీటి వివరాలు ఇప్పుడు చూద్దామ్..!
అవును... శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మహ్మద్ వాయిస్ కు నాణేలను సేకరించడం హాబీ అట. ఈ నేపథ్యంలో... ఈ ఏడాది ముంబై మింట్.. జైన్ తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతిని పురస్కరించుకొని ఈ నాణేలను ముద్రించి విడుదల చేసిందట. దీంతో... ఈ నాణేలను మహ్మద్ వాయిస్ తెప్పించుకున్నారు.
ఈ రెండు రకాల నాణేల బరువు 40 గ్రాములు కాగా.. వీటిని వెండితో తయారుచేశారు. ఈ రెండూ నాణేలను ఫిబ్రవరి 20న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. దీంతో... మార్చి 10న తనకు ఈ రెండు నాణేలు అందాయని.. ఈ క్రమంలో ఇప్పటికే తన వద్ద 170 దేశాలకు చెందిన కరెన్సీ, నాణేలు ఉన్నాయని మహ్మద్ చెబుతున్నారు.
ఇదే సమయంలో... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త కామేశ్వర్ కూడా ఈ రూ.800, రూ.900 నాణేలను సేకరించినట్లు చెబుతున్నారు. వీటిని ప్రత్యేక ఆర్డర్ పై సేకరించారని.. ఆయనకు నాణేలను సేకరించడం అలవాటని అంటున్నారు.