అలా క్యాన్సర్ నయమైందన్న సిద్ధూ... రూ.850 కోట్లు చెల్లించాలని నోటీసు!
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ రూ.850 కోట్లు కట్టాలంటూ ఛత్తీస్ గఢ్ సివిల్ సొసైటీ నోటీసులు జారీ చేసింది.
By: Tupaki Desk | 29 Nov 2024 4:50 AM GMTక్యాన్సర్ అనేది ఎంత తీవ్రమైన సమస్య అనేది తెలిసిన విషయమే. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స సమయంలో పేషెంట్లు ఎంతో శారీరక, మానసిక ఆవేదనకు గురవుతారని అంటుంటారు. అయితే... చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న తన భార్య స్టేజ్-4 నుంచి సహజమైన పద్దతుల్లో కోలుకుంటుందని సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై సొసైటీ కీలక నోటీసులు జారీ చేసింది!
అవును... పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ రూ.850 కోట్లు కట్టాలంటూ ఛత్తీస్ గఢ్ సివిల్ సొసైటీ నోటీసులు జారీ చేసింది. స్టేజ్-4 క్యాన్సర్ నుంచి తన భార్య సహజమైన పద్ధతుల్లో కోలుకుందని ఇటీవల సిద్ధూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సొసైటీ నోటీసులు జారీ చేసింది. ఈ సమయంలో... వాటికి సంబంధించిన పత్రాలను ఏడు రోజుల్లో సమర్పించాలని తెలిపింది.
క్యాన్సర్ తో చాలా కాలంగా బాధపడుతున్న తన భార్య నవజోత్ సింగ్ కౌర్ కోలుకున్నారని ఇటీవల తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధూ తెలిపారు. ఇదే సమయంలో.. తన భార్య బ్రతకడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని వైద్యులు చెప్పారని వెల్లడించారు. అయినప్పటికీ ఆమె క్యాన్సర్ ను జయించిందంటూ తెలిపారు.
దీనికి కారణం... ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని, డైట్ ఫాలో అవ్వడమే అని.. అందువల్లే క్యాన్సర్ ను జయించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో.. ఆమె తీసుకున్న డైట్ ప్లాన్ గురించి కూడా సిద్ధూ వివరించారు. ఇందులో భాగంగా... రాత్రి 7 గంటలకు భోజనం చేస్తే మళ్లీ ఉదయం 10 గంటలకు భోజనం చేయాలని తెలిపారు.
ఈ విధంగా ఆహారం తీసుకునేటప్పుడు గ్యాప్ ఇస్తే క్యాన్సర్ కణాలు వాటంతట అవే చనిపోతాయని సిద్ధూ చెప్పుకొచ్చారు. ఇక ఆహారంలో ప్రధానంగా.. వేప, నిమ్మ, తులసి వంటివి ఎక్కువగా ఉపయోగించాలని.. వాటితో పాటు పసుపు, గుమ్మడికాయ రసం, అల్లం, బీట్ రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ వంటివి రోజువారీ ఆహారంలో తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ విధంగా చేయడంతో తన భార్య 40 రోజుల్లో క్యాన్సర్ జయించినట్లు సిద్ధూ చెప్పుకొచ్చారు. దీంతో.. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఛతీస్ గఢ్ సివిల్ సొసైటీ కన్వీనర్ డాక్టర్ కులదీప్ సోలంకీ స్పందించి.. నోటీసులు జారీ చేశారు. దీనిపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపారు.
అలా కానిపక్షంలో క్షమాపణలు చెప్పాలని ఆయన తెలిపారు. సిద్ధూ చెప్పిన డైట్ గురించి విని దేశ, విదేశాల్లో క్యాన్సర్ రోగులు నుంచి అల్లోపతి వైద్యంపై వ్యతిరేకత వస్తుందని ఆయన తెలిపారు. అలా కానిపక్షంలో కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు!