Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 8 ఏళ్ల అంధ బాలిక రేప్.. మరో దారుణం ఏమంటే?

హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్వహించే అంధ బాలిక హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ బాత్రూంలు శుభ్రం చేసే దుర్మార్గుడు.. మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

By:  Tupaki Desk   |   25 July 2024 7:17 AM GMT
హైదరాబాద్ లో 8 ఏళ్ల అంధ బాలిక రేప్.. మరో దారుణం ఏమంటే?
X

అవును.. హైదరాబాద్ మహానగరంలో అత్యంత అమానవీయమైన ఘోరం చోటు చేసుకుంది. అన్నెంపున్నెం ఎరుగని ఒక చిన్నారిపై అత్యాచారం జరగటం ఒక ఎత్తు అయితే.. ఇంత దారుణం జరిగిన తర్వాత స్పందించాల్సిన వ్యవస్థలు స్పందించకపోవటం.. ఆ చిన్నారి తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొన్న తీరు తెలిస్తే కంట కన్నీరు రావటం ఖాయం. విన్నంతనే ఇంత ఘోరమా? అన్న భావన కలిగేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

హైదరాబాద్ లో ప్రభుత్వం నిర్వహించే అంధ బాలిక హాస్టల్ లో దారుణం చోటు చేసుకుంది. అక్కడ బాత్రూంలు శుభ్రం చేసే దుర్మార్గుడు.. మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తనకు జరిగిన ఘోరం ఆ చిన్నారిని తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తుంటే.. మరోవైపు తీవ్ర రక్తస్రావానికి గురైంది. ఇలాంటి పరిస్థితి చూసిన ఏ మనసున్నోడు అయినా వెంటనే ఆసుపత్రికి తరలిస్తారు. తప్పు చేసినోడి తాట తీయాలని తపిస్తాడు. కానీ.. హాస్టల్ సిబ్బంది మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది.

మీ అమ్మాయి అస్వస్థతకు గురైందంటూ కబురు పంపి.. వారికి ఇచ్చి పంపారు. జరిగిన విషయాన్ని గుర్తించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. హాస్టల్ సిబ్బంది అస్వస్థత అని చెప్పగా.. తమ కుమార్తెను అసలేం జరిగిందన్న వివరాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు బాధితురాలి తల్లిదండ్రులు. కళ్లు కనిపించని తమ కుమార్తె చెప్పిన వివరాలతో ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతో పోలీసుల వద్దకు వెళ్లారు. అయితే.. మలక్ పేట పోలీసులు స్పందించలేదు. ఊరికి వెళ్లి వైద్యం చేయించుకో అంటూ ఉచిత సలహా ఒకటి ముఖాన పడేశారు.

దీంతో చసేదేమీ లేక.. తమ కుమార్తెను తీసుకొని ఊరికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులకు చూపించగా.. ఆమెపై అత్యాచారం జరిగిందన్న అనుమానంతో.. వెంటనే హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరారు. ఇన్ని రోజులు సదరు చిన్నారికి రక్తస్రావం జరుగుతూనే ఉంది. ఆ చిన్నారి ఎంతటి నరకానికి గురైందన్నది ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. నిలోఫర్ వైద్యులకు చిన్నారిని చూపించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందన్న విషయాన్నిచెప్పి.. మలక్ పేట పోలీసులకు సమాచారం అందించారు.

అప్పటికి కానీ పోలీసుల్లో చలనం రాలేదు. ఈ నెల 16న పోక్సో కేసు నమోదు చేసి.. దీనికి బాధ్యుడైన నిందితుడ్ని అరెస్టు చేశారు. హాస్టల్ లో బాత్రూంలు శుభ్రం చేసే 25 ఏళ్ల నరేశ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన ఈ నెల మొదటి వారంలో జరిగితే.. పోక్సో కింద పదహారో తారీఖును కేసు నమోదు చేశారు. 24న నిందితుడ్ని అరెస్టు చేశారు.

ఒక చిన్నారికి జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. జరిగిన విషయాల్ని పోలీసులు గుట్టుగా ఉంచే ప్రయత్నం చేశారు.

అయితే.. స్థానిక నాయకులు.. ఏబీవీపీ ప్రతినిధులు బుధవారం మలక్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేయటంతో ఈ విషయం బయటకు పొక్కింది.ఈ ఘటనపై దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. విచారణ జరుగుతోందని.. లభించిన ఆధారాల మేరకు దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా.. ఒక చిన్నారికి జరిగిన దారుణ ఘటన విషయంలో స్పందించాల్సిన తీరు ఇలా ఉండకూడదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.