Begin typing your search above and press return to search.

చరిత్ర సృష్టించిన టీడీపీ... లోకేష్ ఖాతాలో మరో కలికితురాయి!

వాస్తవానికి గతంలో రూ.100 సభ్యత్వంతో రెండు లక్షలు ప్రమాద బీమా ఉండేది. అయితే తాజాగా దాన్ని రూ.5 లక్షలకు పెంచారు.

By:  Tupaki Desk   |   25 Nov 2024 3:52 PM GMT
చరిత్ర సృష్టించిన టీడీపీ... లోకేష్  ఖాతాలో మరో కలికితురాయి!
X

"చరిత్ర సృష్టించాలన్నా మేమే.. దాన్ని తిరగరాయాలన్నా మేమే"... నందమూరి బాలకృష్ణ సినిమాలోని ఓ డైలాగ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సాధించిన రికార్డ్ విషయంలో పైన చెప్పుకున్న బాలయ్య సినిమా డైలాగ్ ను అప్లై చేస్తూ స్పందిస్తున్నారు నెటిజన్లు.

అవును... "యువగళం" పాదయాత్రతో కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించిన నారా లోకేష్.. ఇటీవల తన సారధ్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం సరికొత్త రికార్డు సృష్టించింది. జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతూ చరిత్రను తిరగ రాస్తోందనే చెప్పాలి!

పార్టీని స్థాపించిన గత 43 ఏళ్లలో ఇదివరకెన్నడూ లేనివిధంగా అతితక్కువ సమయంలో అరకోటి సభ్యత్వం పూర్తి చేసింది. దీంతో.. ఇదీ పసుపు జెండా సత్తా అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. గత నెల 26న ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాటి నుంచి అవిరామంగా కొనసాగుతోంది.

ఈ క్రమంలోనే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైన 29 రోజుల్లోనే ఏకంగా 50 లక్షల మార్కును దాటుకోవడం గమనార్హం. దీనికి కారణం... గతానికి భిన్నంగా అధినాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈసారి మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగుతోందని అంటున్నారు. లోకేష్ ఆదేశాలతో పార్టీలో సరికొత్త రిఫరల్ సిస్టమ్ కు శ్రీకారం చుట్టారు.

ఈ సమయంలో... రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ముందు వరుసలో నిలిచిన వారిని మంత్రి లోకేష్ నేరుగా ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీంతో.. ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఈ విషయంలో సరికొత్త ఉత్సాహం చూపిస్తున్నారని అంటున్నారు.

వాస్తవానికి గతంలో రూ.100 సభ్యత్వంతో రెండు లక్షలు ప్రమాద బీమా ఉండేది. అయితే తాజాగా దాన్ని రూ.5 లక్షలకు పెంచారు.

ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం... అత్యధికంగా రాజంపేట నియోజకవర్గ 93,720 సభ్యత్వాలతో అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా కుప్పం (82,176).. కళ్యాణదుర్గం (77,720).. పాలకొల్లు (77,720).. మంగళగిరి (65,899) సభ్యత్వాలతో తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరోపక్క తెలంగాణలో సభ్యత్వాలు పుంజుకున్నాయని అంటున్నారు.

కాగా... ప్రతిపక్షంలో ఉండగా చితికిపోయిన కార్యకర్తలకు బాసటగా నిలిచేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా గత ఐదేళ్లలో రూ.135 కోట్లకు పైగా పార్టీ కేడర్ కు సాయం అందించారు. ఏది ఏమైనా.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సభ్యత్వ నమోదుతో పాటు కష్టపడిన కార్యకర్తను గుర్తించడం టీడీపీ చరిత్రలో సువర్ణాధ్యాయం అని అంటున్నారు!

ఇక.. 2014లో కార్యకర్తల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ ను నారా లోకేష్ ప్రవేశపెట్టడంతో.. దేశంలోనే ఈ విధమైన కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి రాజకీయ పార్టీగా ‘తెలుగుదేశం పార్టీ’ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సభ్యత్వ నమోదుల విషయంలోనూ సరికొత్త రికార్డ్ సృష్టించారు.