రేషన్ కార్డులు రూపు మారుస్తున్న బాబు ప్రభుత్వం
అయితే రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చాలని చూసినా ఏవో ఆటంకాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Jan 2025 2:33 PM GMTఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రేషన్ కార్డుల రూపు రేఖలను సమూలంగా మారుతోంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తి చేసుకుంది. అయితే ఈ రోజుకీ వైసీపీ ప్రభుతంలోని రేషన్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఆ కార్డుల మీద నాటి సీఎం జగన్ ఫోటో ముద్రించి ఉంది.
అయితే రేషన్ కార్డులను కూటమి ప్రభుత్వం తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చాలని చూసినా ఏవో ఆటంకాలు వస్తున్నాయి. 2024 డిసెంబర్ లోగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకున్నారు. కానీ ఈలోగా రెవిన్యూ సదస్సులు ఏపీలో అంతటా నెలా పదిహేను రోజుల పాటు నిర్వహించడంతో సిబ్బందికి తీరిన లేక రేషన్ కార్డుల వ్యవహారం వెనక్కి వెళ్ళింది.
ఇపుడు మళ్లీ ఈ వైపుగా ప్రభుత్వం చూస్తోంది. సాధ్యమైనంత తొందరలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం అలాగే పాత కార్డులలో భోగస్ కార్డులను ఏరివేయడంతో ఏపీలో రేషన్ కార్డులు అసలైన అర్హులకే పూర్తి స్థాయిలో అందించాలని చూస్తోంది.
ఈ రోజున రేషన్ కార్డునే ప్రమాణంగా తీసుకుని అన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ పధకాలు కూడా రేషన్ కార్డులనే అర్హతగా తీసుకుని అందిస్తున్నారు. దాంతో చాలా పకడ్బందీగా రేషన్ కార్డులను జారీ చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చ్యంతో ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే రేషన్ కార్డులను క్యూ ఆర్ కోడ్ లో రూపొందిస్తున్నారని అంటున్నారు. క్రెడిట్ కార్డుని పోలి ఉండేలా దీనిని డిజైన్ చేయించారు అని తెలుస్తోంది. ఇక కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు మార్పు చేర్పులో కోసం అలాగే కొత్తగా కార్డులు అప్లై చేయడానికి కూడా వీలు కల్పించేందుకు నిర్ణయించారు.
జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆన్ లైన్ పోర్టల్ ని ఏర్పాటు చేసి కొత్త కార్డుల దరఖాస్తు దాని నుంచి స్వీకరిస్తారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఒక కోటీ నలభై ఎనిమిది లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి. కొత్తగా మరో రెండు లక్షల కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో కోటిన్నర కార్డులు ఏపీలో ఉంటాయని అంటున్నారు.
ఈ కొత్త కార్డులలో విశేషం ఏమిటంటే స్కాన్ చేస్తే మొత్తం కుటుంబాల వివరాలు అన్నీ కనిపిస్తాయి. ఆకర్షణీయంగానే కాకుండా ఏ రంగులూ లేకుండా ఎవరి ముద్ర లేకుండా ఈ కొత్త కార్డులు ఉంటాయని అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త కార్డుల జారీకి రంగం సిద్ధం చేస్తోంది అని అంటున్నారు.