చెన్నైలో కొత్త పైత్యం.. ఇళ్ల వద్దే కాన్పులు.. ఇదెలా పెరిగిందంటే?
అప్పట్లో అంటే.. ఆరోగ్య వసతులు తక్కువగా ఉండటం.. ఆసుపత్రులు అందుబాటులో ఉండకపోవటం లాంటివి ఉండేవి.
By: Tupaki Desk | 25 Nov 2024 7:30 AM GMTకొన్ని దశాబ్దాల క్రితం.. మన అమ్మ.. అమ్మమ్మ కాలంలో ఇంటి దగ్గరే డెలివరీలు సాగేవి. వాటి గురించిన వివరాలు తెలిసినంతనే గగుర్పాటుకు గురవుతుంటాం. ఇంటి వద్ద కాన్పుల కారణంగా చాలాసార్లు తల్లీ.. బిడ్డ ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేది. ఒక్కోసారి క్లిష్టమైన డెలివరీ సమయాల్లో మహిళలు నరకయాతన పడేవారు. అప్పట్లో అంటే.. ఆరోగ్య వసతులు తక్కువగా ఉండటం.. ఆసుపత్రులు అందుబాటులో ఉండకపోవటం లాంటివి ఉండేవి. ఇప్పుడు అలాంటి దయనీయ పరిస్థితులు లేవు. కానీ.. చెన్నై మహానగరంలో ఇటీవల కాలంలో పెరిగిన ఒక పైత్యం దశాబ్దాల క్రితం నాటి అనాగరిక పద్దతుల్ని అనుసరిస్తూ.. ఇంటి వద్దే డెలివరీలు చేసేలా ప్రోత్సహిస్తున్న దుర్మార్గం బట్ట బయలైంది.
తాజాగా చెన్నై మహానగరంలో ఒక ప్రసవం ఇంటి వద్దే చోటు చేసుకున్న వైనం వెలుగు చూసింది. తిరువణ్ణామలైకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి.. 32 ఏళ్ల తన భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇప్పటికే వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి ఎనిమిదేళ్లు కాగా.. చిన్నమ్మాయికి నాలుగేళ్లు. తాజాగా అతడి భార్య మూడోసారి గర్భం దాల్చింది. ఏ ఆసుపత్రి నుంచి ఎలాంటి వైద్య సాయాన్ని తీసుకోలేదు సరికదా.. ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదు. నెలలు నిండిన తర్వాత నొప్పులు వస్తున్నా.. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరే భర్త ప్రసవం చేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇలాంటి తీరు తల్లి బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి చేష్టలు అనవసర ప్రమాదాలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ఇంతకూ ఎలాంటి వైద్య సాయం తీసుకోకుండా ఈ దంపతులు ఎలా ప్రసవం చేసుకున్నారన్న విషయంపై ఆరోగ్య శాఖ ఫోకస్ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. దీని ప్రకారం వీరో వాట్సాప్ గ్రూప్ ఉందని.. అందులో 1024 మంది సభ్యులున్నట్లుగా గుర్తించారు.
ఈ వాట్సాప్ గ్రూప్ ను ఇంట్లోనే ప్రసవాలు చేసుకునేందుకు అవసరమైన అనుభవాలు.. సలహాల్ని సభ్యులకు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేయటం గమనార్హం. ఈ గ్రూపులో ఉన్న వారిలో ఎక్కువ మంది ఇంట్లోనే ప్రసవాల్ని చేసుకున్న వారు ఉన్నట్లు గుర్తించారు. వీరు తమ అనుభవాల్ని గ్రూపు సభ్యులతో పంచుకోవటంతో పాటు.. ఏ టైంలో ఎలా వ్యవహరించాలన్న వివరాల్నిషేర్ చేసుకోవటం కనిపించింది. డెలివరీ అయ్యాక.. తమకు పుట్టిన పాప ఆరోగ్యంగా ఉందని భావించిన జంటలు తమ పిల్లల ఫోటోల్ని ఇందులో షేర్ చేసుకుంటున్నారు.
ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఆరోగ్య శాఖ.. ఈ సమాచారాన్ని పోలీసులకు.. ఇతర విభాగాలకు సమాచారం అందించింది. దీంతో.. వీరిపై కేసు నమోదైంది. బాలింతకు వైద్య సాయాన్ని అందిస్తున్న ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది మే మొదటి వారంలో ఒక ఐటీ ఉద్యోగితో సన్నిహితంగా ఉన్న కారణంగా ఒక నర్సు ప్రెగ్నెంట్ అయ్యింది.
ఈ విషయాన్ని ఎవరికి తెలియకూడదన్న ఉద్దేశంతో ఆమె తాను ఉంటున్న హాస్టల్ బాత్రూంలో స్వయంగా బిడ్డను బయటకు తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో బిడ్డను ముక్కలు చేసింది. అప్పట్లో ఆమెపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆమెకు వైద్య సాయాన్ని అందించి.. అనంతరం ఆమెను అరెస్టు చేశారు. మరో ఉదంతంలో యూట్యూబ్ సాయంతో భర్త భార్యకు కాన్పు చేశారు. ఈ సమయంలోనూ భార్యకు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో.. వేలూరులోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలా తమిళనాడులో జరుగుతున్న ఉదంతాలపై ఇప్పుడు ఆరోగ్య శాఖ ఫోకస్ చేసింది. ఈ తీరును అధికారులు.. వైద్యులు.. వైద్య నిపుణులు తప్పు పడుతున్నారు.