Begin typing your search above and press return to search.

తండ్రి ఫోన్ రిపేర్ చేయించలేదని... దారుణానికి ఒడిగట్టిన కొడుకు!

నిద్ర లేవగానే ఫోన్ చూడటం నుంచి మొదలైన రోజు.. రాత్రి ఫోన్ చూస్తూ చూస్తూనే నిద్రలోకి జారుకోవడంతో ముగుస్తోంది!

By:  Tupaki Desk   |   15 March 2025 12:57 PM IST
తండ్రి ఫోన్  రిపేర్  చేయించలేదని... దారుణానికి ఒడిగట్టిన కొడుకు!
X

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్ కు ఏ స్థాయిలో ప్రజలు అడిక్ట్ అయిపోతున్నారనే సంగతి తెలిసిందే. చిన్న పిల్లలకు అన్నం తినిపించడం దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ వాడకం మొదలవుతోంది. ఇక యువత సంగతి అయితే చెప్పే పనేలేదు. నిద్ర లేవగానే ఫోన్ చూడటం నుంచి మొదలైన రోజు.. రాత్రి ఫోన్ చూస్తూ చూస్తూనే నిద్రలోకి జారుకోవడంతో ముగుస్తోంది!

అన్నం తింటున్నా.. పేరెంట్స్ తో మాట్లాడుతున్నా.. సినిమా చూస్తున్నా.. ఆఖరికి బాత్ రూమ్ లో కాలకృత్యాలు తీర్చుకుంటున్నా కూడా ఒక చేతిలో ఫోన్ ఉండాల్సిన పరిస్థితి అని చెబుతుంటారు. ఆ స్థాయిలో మనిషికి – స్మార్ట్ ఫోన్ కు అనుబంధం పెరిగిపోయింది. ఈ సమయంలో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది. తండ్రి ఫోన్ రిపేర్ చేయించి ఇవ్వలేదని.. కుమారుడు దారుణానికి ఒడిగట్టాడు.

అవును... ఈ ఏడాది సంక్రాంతికి ముందు మహారాష్ట్రలో ఘోరం జరిగిపోయిన సంగతి తెలిసిందే. తన తండ్రి స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదనే కారణంతో 10వ తరగతి చదువుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. కుమారుడు చనిపోయాడన్న మనోవేదనతో తండ్రి మరణించాడు. ఈ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్ లో ఫోన్ రిపేర్ చేయించలేదని దారుణానికి ఒడిగట్టిన కొడుకు విషయం తెరపైకి వచ్చింది.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని ఏష్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదం చోటుచేసుకుంది. ఇందులో భాగంగా... ఆ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఓ యువకుడు తన ఫోన్ రిపేర్ చేయించలేదని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇప్పుడు ఫోన్ రిపేర్ చేయించలేనని.. కొత్త ఫోను కొనివ్వలేనని తండ్రి చెప్పడంతో కుమారుడు ఈ చర్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బాగ్ ఫర్హత్ పరిధిలోని ఓకాఫ్ కాలనీలో సయీద్ ఖాన్ (18) ఉంటున్నాడు. 12వ తరగతి పాసైనా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా డిగ్రీలో చేరని సయీద్ ఫోను నాలుగు రోజులుగా ఛార్జింగ్ కావడం లేదట. దీంతో.. ఫోన్ రిపేర్ చేయించేందుకు షాపుకు తీసుకెళ్లగా.. చాలా ఖర్చవుతుందని చెప్పాడట. ఇదే విషయాన్ని సయీద్.. తన తండ్రికి చెప్పాడు.

అయితే... తన దగ్గర అంత డబ్బులు లేవని.. ఆ ఫోన్ రిపేరు చేయించలేనని.. కొత్త ఫోన్ కొనివ్వలేనని తండ్రి చెప్పారు. దీంతో.. కలత చెందిన సయీద్... ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సయీద్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు!