Begin typing your search above and press return to search.

'ప్రేమ' వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయింది

ప్రేమోన్మాది వేధింపులకు బలైన రాశి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   24 Nov 2024 4:57 AM GMT
ప్రేమ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి చనిపోయింది
X

ప్రేమ వేధింపులకు మరొకరు బలి అయ్యారు. ఇష్టం లేదని చెప్పినా.. వినకుండా అదే పనిగా వేధింపులకు దిగిన వ్యక్తి విషయంలో వేదనకు గురైన ఒక అబల తన ప్రాణాల్ని తీసుకుంది. ఈ విషాద ఉదంతం భీమిలి మండలంలో చోటు చేసుకుంది. ప్రేమోన్మాది వేధింపులకు బలైన రాశి ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

భీమిలి మండలం మజ్జివలస గ్రామానికి చెందిన 22 ఏళ్ల రాశి డిగ్రీ వరకు చదివింది. ప్రస్తుతం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా వాలంటీరుగా పని చేస్తోంది. అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల పిల్లి రాజు గడిచిన కొన్నేళ్లుగా ఆమె వెంట పడుతున్నాడు. ప్రేమ పేరు చెప్పి వేధింపులకు దిగుతున్నాడు.

తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా అతను పట్టించుకోకపోగా.. ఆమెపై వేధింపుల తీవ్రతను పెంచేవాడు. దీంతో విసిగిపోయిన ఆమె.. పొలాల్లో జల్లటానికి ఇంట్లో ఉంచిన పురుగుల మందును ఈ నెల 16న తాగింది. ఆమె ఆత్మహత్యయత్నాన్ని గుర్తించిన ఇంట్లోని వారు ఆమెను తగరపువలస ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్సను అందించారు.

మ్రత్యువుతో పోరాడిన ఆమె చివరకు ఓడిపోయింది. గురువారం సాయంత్రం రాశి కన్నుమూసింది. శుక్రవారం ఉదయం ఆమెకు అంత్యక్రియల్ని నిర్వహించారు. యువతి మరణానికి కారణమైన రాజును పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని రిమాండ్ కు తరలించారు. అయితే.. ఇంటి పరువు బజారున పడుతుందన్న ఉద్దేశంతో ఈ విషయాలేవీ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. రాశి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లుగా పేర్కొన్నారు.