Begin typing your search above and press return to search.

అమరావతిపై ఆకాశ రామన్న లేఖలు

రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా కొందరు దుష్ట పన్నాగాలు పన్నుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

By:  Tupaki Desk   |   24 Dec 2024 1:08 PM GMT
అమరావతిపై ఆకాశ రామన్న లేఖలు
X

ప్రపంచ బ్యాంకు నిధులతో ఏపీ రాజధాని అమరావతి పనులపై ఆనందం వ్యక్తమవుతుంటే.. ఆకాశ రామన్న లేఖలతో వరల్డ్ బ్యాంకు నిధులకు గండి కొట్టే ప్రయత్నాలు ఆవేదన కలిగిస్తున్నాయి. రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా కొందరు దుష్ట పన్నాగాలు పన్నుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

రాజధాని పనులకు ప్రభుత్వం ఒకవైపు సిద్ధమవుతుండగా, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరోవైపు అమరావతిని అడ్డుకోవడమే లక్ష్యంగా తమ వ్యూహాలను పదునెక్కిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఏడీబీతో కలిసి రాజధాని నిర్మాణానికి రూ.13,592 కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు కేటాయించింది. ఆరేళ్లలో విడతల వారీగా ఈ డబ్బు అందజేయనుంది. తొలివిడతగా వచ్చేనెల రూ.348 కోట్లు ప్రభుత్వానికి అందనున్నాయి. దీంతో ప్రభుత్వం రాజధాని పనుల కోసం ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ నిధులతో రోడ్డు నిర్మాణాలకు ఆమోదం తెలుపుతూ వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని చూస్తోంది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మాత్రం ఊరు, పేరు లేకుండా ప్రపంచ బ్యాంకుకు అమరావతిపై విషం చిమ్ముతూ లేఖలు రాస్తున్నారు. ఈ నెల 18న ప్రపంచ బ్యాంకు ఇన్ స్పెక్షన్ కమిటీకి ఆకాశ రామన్న లేఖ ఒకటి వెళ్లింది. రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేయడం చట్ట విరుద్ధమని, రైతులను భయపెట్టి, బెదిరించి సంతకాలు చేయించుకున్నారని ఆరోపిస్తూ ఈ లేఖ రాశారని ప్రభుత్వానికి సమాచారం అందింది.

రాజధాని నిర్మాణానికి బలవంతంగా భూములు తీసుకోవడం వల్ల రైతుల జీవన భృతి కోల్పోతారని, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని ఆ లేఖలో ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న కూలీలకు ఉపాధి దక్కడం లేదని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పనులు ఇస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. ఈ లేఖ ప్రపంచబ్యాంకుకు వెళ్లిన విషయం ప్రభుత్వానికి వెంటనే తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

2014-19లో రాజధాని పనులు మొదలైన నుంచి ఇలాంటి ఆకాశ రామన్న లేఖలు కోకొల్లలుగా ప్రపంచ బ్యాంకుకు వెళుతున్నాయి. దీని వెనుక కొందరు వైసీపీ పార్టీ నేతల హస్తం ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. 2019 ముందు కూడా ఇలాంటి లేఖలు రాయడం ద్వారా అప్పట్లో వరల్డ్ బ్యాంకు ఇస్తామన్న రూ.3,500 కోట్లు విడుదల కాకుండా నిలిచిపోయాయి. ఇప్పుడు కూడా అదే విధమైన పంథాను అనుసరిస్తుండటంతో రాజధాని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

గతంలో లేఖలు అందుకున్న ప్రపంచ బ్యాంకు అధికారులు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుంది. రైతులు స్వచ్ఛందంగానే భూములిచ్చారని తెలుసుకుని నిధులు ఇచ్చేందుకు సమ్మతించింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రుణం అవసరం లేదని లేఖ రాయడంతో ఆ నిధులు విడుదల కాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో మళ్లీ ప్రయత్నించడంతో రాజధానికి రూ.15 వేల కోట్లు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఆకాశరామన్నలు వెనక్కి తగ్గకపోవడం చర్చనీయాంశమవుతోంది.