ఐప్యాక్ కి .కేజ్రీతో క్రేజ్ వస్తుందా ?
ఇపుడు మరోసారి ఐప్యాక్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది అని అంటున్నారు. కొత్త ఏడాది వస్తూనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.
By: Tupaki Desk | 4 Dec 2024 3:55 AM GMTఐప్యాక్ టీం 2019లో ఏపీలో వైసీపీని గెలిపించింది. ఆ మరుసటి ఏడాది 2020లో ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆప్ పార్టీని కూడా గెలిపించింది ఇక 2024లో వైసీపీ పక్షాన ఐప్యాక్ పనిచేసినప్పటికీ ఘోరమైన ఫలితాలే వచ్చారు. ఆనాడూ ఈనాడూ జాతీయ స్థాయిలో వైసీపీ విజయమూ అపజయమూ చర్చకు తావిచ్చింది.
ఈ రెండింటి వెనకాల ఐప్యాక్ టీం పాత్ర ఉంది. మరి జగన్ గెలిచి ఎందుకు ఓడారు అంటే దానికి జవాబు కష్టమే. విపరీతమైన వ్యతిరేకత వైసీపీకి ఉందని ఐప్యాక్ చెప్పలేకపోయింది అన్నది కూడా మరో విమర్శ ఉంది. ఇదిలా ఉంటే ఐప్యాక్ 2020లో ఆప్ ని గెలిపించి ముఖ్యమంత్రిగా మరోసారి అరవింద్ కేజ్రీవాల్ ని గెలిపించించింది.
ఇపుడు మరోసారి ఐప్యాక్ తో ఆప్ ఒప్పందం కుదుర్చుకుంది అని అంటున్నారు. కొత్త ఏడాది వస్తూనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ క్రేజ్ ఏమిటో చూడాల్సి ఉంది. దాంతో పాటుగా ఐప్యాక్ వ్యూహాల పదును కూడా తెలియాల్సి ఉంది. 2020లో గెలిపించినంత సులువు అయితే ఈసారి కాదు.
ఏకంగా పదేళ్ల పాటు కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం గా ఉన్నారు. ఆయన ప్రభుత్వం పట్ల సహజంగానే వ్యతిరేకత ఉంటుంది అని అంటున్నారు. దానిని అధిగమించి విజయ తీరాలకు చేర్చడం అంటే బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మరి ఈ టాస్క్ ని ఐప్యాక్ ఎంతవరకూ సాధిస్తుంది అన్నదే బిగ్ క్వశ్చన్.
కేజ్రీవాల్ కి 2020లో ఉన్న ఇమేజ్ వేరు. ఆయన మీద అవినీతి మరక అయితే లేదు. కానీ ఈసారి ఆయన లిక్కర్ స్కాం లో జైలుకి వెళ్ళి వచ్చారు. ఆయన జైలులో ఉన్నారు అంటే నేరం చేసినట్లు కాదు కానీ ఆయన ఎందుకు జైలుకు వెళ్లారు అన్న దానికి కూడా జనాల్లో చర్చ అయితే ఉంటుంది. తుది తీర్పు వచ్చి క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ ఎవరి అభిప్రాయాలు వారికి జనాలలో ఉంటాయి.
ఇక అరవింద్ కేజ్రీవాల్ ని ఈసారి బీజేపీ గట్టిగానే చాలెంజ్ చేస్తోంది. ఆ పార్టీలో కీలక నేతలను కలుపుకుంటోంది. వరస విజయాలతో దూకుడు మీద ఉన్న బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కూడా కొట్టాలని చూస్తోంది. ఇంకో వైపు చూస్తే కేజ్రీవాల్ సీఎం గా ఉంటే సీన్ వేరు. ఆయన తప్పుకుని అతిషీకి చాన్స్ ఇచ్చారు. దాంతో సీనియర్లు తమకు కేజ్రీవాల్ ఇచ్చే ప్రాధాన్యత ఇంతేనా అన్నది తలచుకుని కుములుతున్నారు.
ఇది కూడా ఆప్ లో కల్లోలం రేపుతోంది. ఇలా అనేక అంశాలు అయితే ఆప్ విషయంలో ఉన్నాయి. ఆప్ మరో ప్రకటన కూడా చేసింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకపోతే అది బీజేపీకి వరంగా మారుతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇక ఈసారి గెలుపు విషయంలో కేజ్రీవాల్ కి కూడా కొంత ఇబ్బంది ఉందని అర్థం అయినట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన ఎన్నడూ లేనిది తిరుపతి వచ్చి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు.
ఇవన్నీ ఇలా ఉన్న నేపథ్యంలో ఐప్యాక్ అన్నది భారీ ఫెయిల్ ని ఏపీలో మూటకట్టుకున్న తరువాత టేకప్ చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ అరవింద్ కేజ్రీవాల్ ది అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో సక్సెస్ అయితే ఐప్యాక్ మీద మళ్లీ వైసీపీకి కూడా నమ్మకం కుదురుతుంది. ఇప్పటికే ఐప్యాక్ సేవలను వైసీపీ ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. దానికి మరింత బూస్ట్ గా ఢిల్లీ ఫలితాలను ఆప్ కి అనుకూలం చేయాల్సిన బాధ్యత ఐప్యాక్ టీం కి ఉంది. మరి కేజ్రీని సీఎం గా ఇంకోసారి ఈ టీం గెలిపిస్తుందా చూడాల్సిందే.