ఆప్ ప్లస్ కాంగ్రెస్ =49.91…తప్పు ఇండియా కూటమిదే కదా ?
కలసి ఉంటే కలదు సుఖం అని ప్రాధమిక విద్యాభ్యాసంలోనే చెబుతారు. కానీ రాజకీయ పార్టీలను నడిపే అధినేతలకు అది తెలియలేదా అన్నది ఒక ప్రశ్న.
By: Tupaki Desk | 9 Feb 2025 9:15 AM ISTకలసి ఉంటే కలదు సుఖం అని ప్రాధమిక విద్యాభ్యాసంలోనే చెబుతారు. కానీ రాజకీయ పార్టీలను నడిపే అధినేతలకు అది తెలియలేదా అన్నది ఒక ప్రశ్న. తెలిసినా పొలిటికల్ ఇగోలు దానిని డామినేట్ చేసిందా అన్నది మరో ప్రశ్న. లేకపోతే కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యాలు అందరికీ అర్ధమవుతున్న విషయాలను సైతం పక్కన పెట్టి ఏటికి ఎదురీదడం వల్లనే బొక్క బోర్లా పడుతోంది ఇండియా కూటమి అంటే తప్పు ఎవరిది.
ఇది ఈ రోజుది కాదు లోక్ సభ ఎన్నికల నుంచి ఇదే తంతు. సర్దుబాట్లు చేసుకోలేక కమల వికాసానికి దారులు చూపించిన వైనాలు 2024 ఎన్నికల్లో ఎన్నో కనిపించాయి. అయినా సరే నా రూట్ నాదే అన్న తీరున సాగుతున్న ఇండియా కూటమి మిత్రులు బీజేపీకి అప్పనంగా విజయాలను అప్పగించి చోద్యం చూస్తున్నారు అన్నదే అసలైన విశ్లేషణ.
దానిని నిట్ట నిలువు నిదర్శనమే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. అంతే కాదు ఇండియా కూటమి పెద్దన్న కాంగ్రెస్ కూడా సై అంటూ ఎన్నికల రేసులోకి వచ్చింది. ఈ రెండూ కలసి చివరికి చేసిందేంటి అంటే బీజేపీకి ఢిల్లీ కిరీటం నెత్తిన పెట్టడం. ఈ విషయంలో తప్పు రెండు పార్టీలదీ ఉంది అని అంటున్నారు.
కాంగ్రెస్ ది జాతీయ పార్టీ అన్న అహంకారం. పైగా తమ అధికారాన్ని కొట్టి ఆప్ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది అన్నది కూడా మరో భావన. అంతే కాదు హర్యానా ఎన్నికల్లో పోటీకి దిగి ఆప్ తమకు నష్టం కలిగించింది అన్నది కూడా ఇంకో భావన. ఇలా ఆప్ మీద కాంగ్రెస్ కి చాలా కారణాలు ఉన్నాయి.
ఆప్ విషయానికి వస్తే కాంగ్రెస్ ని మరీ తక్కువ చేసి చూడడం. ఎంత కాదనుకున్నా కాంగ్రెస్ ఢిల్లీని మూడు సార్లు ఏలింది. ఆ పార్టీకి ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంది అన్నది మరచి ఆప్ నేల విడిచి సాము చేసింది. 2013లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 48 రోజులలో కూలిపోయింది అన్న చేదు అనుభవం కూడా ఆప్ కి ఉంది. పైగా ఒకసారి చోటిచ్చి కాంగ్రెస్ జెండా పాతిస్తే ఎక్కడ తమ ఉనికి దెబ్బ తింటుందో అన్న సందేహాలు ఉన్నాయని అంటున్నారు. కాంగ్రెస్ ది ఇదే వైఖరి. ఆప్ ని ఓడిస్తేనే తాము ఎప్పటికైనా ఢిల్లీలో అధికారంలోకి రాగలుగుతామన్న దూరాలోచనలు.
ఇలా రెండు పార్టీలు ఈ విషయంలో మాత్రం కలసి కూడబలుక్కున్నట్లుగా వేరుగా పోటీ చేసి బంగారు పళ్ళెంలో బీజేపీకి అధికారాన్ని అప్పగించాయి. ఎవరికైనా ఈ విషయంలో డౌట్లు ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఈ అధికారిక వివరాలు ఒక్క సారి చూస్తే తెలిసిపోతుంది.
ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటు షేర్ 45.66 శాతం, ఆప్ కి వచ్చిన ఓటు షేర్ 43.57 శాతం, కాంగ్రెస్ కి వచ్చిన ఓటు షేర్ 6.34 శాతం. అంటే ఆప్ కాంగ్రెస్ కలిస్తే వచ్చిన ఓటు షేర్ అక్షరాలా 49.91 అని పక్కాగా లెక్క తేలుతోంది. ఇంతే కాదు పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆప్ కాంగ్రెస్ ఓట్లు కలిపిస్తే బీజేపీ కంటే ఎక్కువగా వచ్చాయట. మరి అవన్నీ కలుపుకుంటే ఆప్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవి కదా అన్నది ఒక చర్చ. కానీ ఇండియా కూటమి కట్టి అందులో అంతా ఒక్కటిగా ఉన్నామని చెప్పుకుంటూ ఎన్నికల్లో మాత్రం బీజేపీని గెలిపిస్తూ తామోడుతున్న ఈ రాజకీయ చిత్రాన్ని చూసిన ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఆలోచించాల్సిందే.