ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్ వెనుకంజ.. 5 రీజన్లు!
ఢిల్లీలో అధికారం చేపట్టిన జాతీయేతర పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.
By: Tupaki Desk | 5 Feb 2025 2:22 PM GMTఢిల్లీలో అధికారం చేపట్టిన జాతీయేతర పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుంది. వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. తొలిసారి కంటే.. రెండో సారి మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 69 స్థానాలను గుండుగుత్తగా దక్కించుకుని.. పగ్గాలు చేపట్టిన ఆప్.. తాజాగా జరిగిన ఎన్నికల పోలింగ్‌లో వెనుకబడిపోయిందని సర్వేలు చాటుతున్నాయి. దిగ్గజ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు సైతం.. ఆప్ గెలిచేందుకు అవకాశం లేదని స్పష్టంగా పేర్కొన్నాయి. ఢిల్లీలో అధికారం చేపట్టేందుకు మ్యాజిక్ మార్క్ 36 స్థానాలు రావాలి. మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీలో ఆప్‌కు ఒక్క `కేకే` సర్వే మాత్రమే 39 స్థానాలు ఇవ్వగా.. ఇతర సంస్థలు.. 30 లోపే కట్టబెట్టాయి.
అయితే.. అద్భుతాలు జరిగితే మాత్రం ఆప్ విజయం దక్కించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక, ప్రస్తుతం వచ్చిన ఎగ్జిట్ అంచనాల ప్రకారం.. ఆప్ వెనుకబడిందనే చెప్పాలి. ఇది ప్రాథమిక.. ఫలితం మాత్రమే. అయితే.. ఇలా ఎందుకు జరిగింది? ఆప్ ఒకవేళ ఇదే ఫలితాన్ని పొందితే.. దీనివెనుక ఉన్న కారణాలు ఏంటి? అనేది కూడా ఆసక్తిగా మారింది. దీనికి ప్రధానంగా ఐదు కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవే ఆప్‌కు ప్రజల్లో వ్యతిరేకతను పెంచి ఉంటాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే.. ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఈ ప్రభావం కనిపించిందని చెబుతున్నారు.
విశ్లేషకులు చెబుతున్న రీజన్లు ఇవీ..
1) మద్యం కుంభకోణం: రెండోసారి ఆప్ అధికారం చేపట్టిన తర్వాత.. తీసుకువచ్చిన నూతన మద్యం విధానంలో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీలు కేసులు నమోదు చేశాయి. ఇది రాజకీయ వివాదం అని కేజ్రీవాల్ చెప్పినా.. నిప్పు లేందే పొగరాదన్న విషయం.. ప్రజల్లో చర్చకువ చ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎదురు దాడిచేసినా.. ఈ విషయంపై ఆప్ సమర్థవంతమైన వాదనను బలంగా తీసుకువెళ్లలేకపోయింది. ఇది మధ్యతరగతిలో వ్యతిరేకతను పెంచింది.
2) సక్సేనాతో రగడ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో చీటికీ మాటికీ గొడవ పెట్టుకోవడాన్ని కూడా.. ప్రజలు సహించలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఎన్నికలపై ప్రభావం చూపిందని అంటున్నారు.
3) మొహుల్లా క్లినిక్‌లు: ఆప్ రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు మొహుల్లా క్లినిక్(ప్రజావైద్య శాలలు) ఎంతో ఉపయోగపడ్డా యి. కానీ, రెండో సారి అధికారం చేపట్టాక.. వీటిలోనూ అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతోపాటు.. అధికారులను కూడా సస్పెండ్ చేశారు. వైద్య సేవలు కూడా నాసిరకంగా మారాయి.
4) శీష్ మహల్: మాజీ సీఎం కేజ్రీవాల్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. 250 కోట్ల రూపాయలతో అధికారనివాసాన్ని పునర్నిర్మించారు. దీనినే బీజేపీ నేతలు అద్దాల మేడగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా.. తనకు ప్యాలెస్ కట్టుకున్నారని కూడా పేర్కొన్నారు. ఇది అన్ని వర్గాలను ప్రభావితం చేసింది.
5) పాలన చిందర వందర: రెండో దఫా పగ్గాలు చేపట్టిన తర్వాత.. కేజ్రీవాల్ సమయం అంతా.. కోర్టులు , కేసుల చుట్టూ తిరిగింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, రాజ్యసభసభ్యులు, ఏకంగా సీఎం అరెస్టు కావడంతో పాలనపై పట్టు కోల్పోయారు. చివరిలో అతిశీని ముఖ్యమంత్రిని చేసినా.. ప్రయోజనం లేదన్నది విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలోనే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నది వీరి మాట.