Begin typing your search above and press return to search.

కేజ్రీకి మరో టెన్షన్.. పంజాబ్ పై ఢిల్లీ ఎఫెక్ట్

ఢిల్లీలో అధికారం కోల్పోవడం ఆమ్ ఆద్మీ పార్టీలో కల్లోలం రేపుతోందంటున్నారు. ముఖ్యంగా ఆప్ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి పంజాబ్ లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది.

By:  Tupaki Desk   |   10 Feb 2025 10:30 AM GMT
కేజ్రీకి మరో టెన్షన్.. పంజాబ్ పై ఢిల్లీ ఎఫెక్ట్
X

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి ఆప్ పార్టీలో కలవరం పెడుతోందా? పార్టీ అధినేత కేజ్రీవాల్ ను కొత్త టెన్షన్ పెడుతోందా? పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కొత్త పార్టీ పెడుతున్నారా? పంజాబ్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష కాంగ్రెస్ తో దోస్తీకి సై అంటున్నారా? జాతీయ రాజకీయాల్లో తాజాగా వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆప్ ఆధికారంలో ఉన్న పంజాబ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయంటున్నారు.

ఢిల్లీలో అధికారం కోల్పోవడం ఆమ్ ఆద్మీ పార్టీలో కల్లోలం రేపుతోందంటున్నారు. ముఖ్యంగా ఆప్ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి పంజాబ్ లో ప్రభుత్వాన్ని పడగొట్టాలని జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 117 స్థానాలు ఉండగా, ఆప్ బలం 93. ప్రతిపక్షం కాంగ్రెస్ కు 16 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే తాజాగా తమతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సుమారు 30 మంది టచ్ లోకి వచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ లీకులిస్తోంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ సన్నిహితంగా ఉంటున్నారు. వీరిద్దరి కలయిక కొత్త రాజకీయానికి దారితీస్తోందని గత కొంత కాలంగా వినిపిస్తోంది. బీజేపీ మద్దతుతో సీఎం మాన్ సొంత పార్టీ పెడతారని చెబుతున్నారు. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలతో మాన్ వేరుకుంపటి పెడతారని ప్రచారం ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను భయపెడుతోందంటున్నారు.

రెండు రోజుల క్రితం వచ్చిన ఢిల్లీ ఫలితాలతో నిరాశ ఎదురవ్వగా, తాజాగా పంజాబ్ పరిణామాలు కేజ్రీవాల్ ను టెన్షన్ పెడుతున్నాయి. దీంతో ఆప్ ఎమ్మెల్యేలతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. పంజాబ్ లో పార్టీ చీలిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాయ్ పే చర్చ పేరిట కేజ్రీ అలర్ట్ అవ్వడం ఎంతవరకు ఫలితమిస్తుందో గానీ, ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ అవుతోంది.

ఢిల్లీ ఎన్నికల్లో పంజాబీ ఓటర్లు ఉన్న 28 నియోజకవర్గాల్లో 23 చోట్ల బీజేపీ గెలుపొందింది. పంజాబ్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా, ఇటీవల కాలంలో ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి స్నేహం పెరిగిందని అంటున్నారు. శాంతిభద్రతలు, ఖలీస్థానీ టెర్రరిజం, డ్రగ్స్ మాఫియా విషయంలో అమిత్ షా డైరెక్షన్ లో భగవంత్ మాన్ నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరూ తరచూ కలుసుకోవడం, పంజాబ్ సీఎం కూడా ఢిల్లీ ఎన్నికలపై పెద్దగా ఫోకస్ చేయకపోవడం త్వరలో చోటుచేసుకోబోయే మార్పులకు సంకేతంగా చెబుతున్నారు. మొత్తానికి తాజా పరిణామాలు ఆమ్ ఆద్మీలో గుబులు రేపుతున్నాయి.