Begin typing your search above and press return to search.

జగన్ కి ఆప్ నుంచి అనూహ్య మద్దతు !

విశాఖలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబుతో కలసి ఆప్ అధినేత కేజ్రీవాల్ పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 3:40 AM GMT
జగన్ కి ఆప్ నుంచి అనూహ్య మద్దతు !
X

ఢిల్లీకి చెందిన ఆప్ పార్టీ ఏపీకి చెందిన వైసీపీకి అనూహ్యంగా మద్దతు తెలిపింది. ఇది ఒక విధంగా ఆశ్చర్యం కలిగించే అంశమే అని అంటున్నారు. ఆప్ పార్టీ ఏపీలో 2019 ఎన్నికల వేళ టీడీపీకి మద్దతు ఇచ్చింది. విశాఖలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబుతో కలసి ఆప్ అధినేత కేజ్రీవాల్ పాల్గొన్నారు.

అంతే కాదు చంద్రబాబు విజనరీ అని ఆయన మంచి పాలనాదక్షుడు అని గెలిచి తీరాల్సిందే అని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాని కంటే ముందు బీజేపీకి వ్యతిరేకంగా బాబు ధర్మ పోరాట దీక్షలు చేస్తే దానికి కూడా ఆప్ మద్దతు తెలిపింది.

అయితే గత అయిదేళ్లుగా టీడీపీ బీజేపీ మద్దతు కోసం చూడడం చివరికి ఈ ఏడాది మార్చిలో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడంతో టీడీపీ ఇండియా కూటమికి దూరం అయింది. దాని కంటే ముందు కూడా ఇండియా కూటమి నేతలు ఏపీలో అటు వైసీపీని కానీ ఇటు టీడీపీని కానీ పట్టించుకోవడం మానేశారు.

ఆ రెండు పార్టీలు బీజేపీకి మద్దతుగానే ఉంటున్నాయని భావించే వారు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇపుడు కేంద్రంలో అధికారం కైవశం చేసుకోవడానికి ఇండియా కూటమి చూస్తోంది. దాంతో పాటుగా ఎన్డీయే కూటమి మీద కూడా నిప్పులు చెరుగుతోంది. కాంగ్రెస్ తరువాత బీజేపీ మీద అగ్రెసివ్ గా విమర్శలు చేసే పార్టీగా ఆప్ ఉంది.

అటువంటి ఆప్ కి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి పీవీఎస్ శర్మ ఏపీలో రాజకీయ పరిస్థితుల మీద తాజాగా ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వే మీద ఘాటు విమర్శలు చేశారు. ఈ సర్వే ప్రకారం ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చింది.

ఏపీలో తెలుగుదేశం పార్టీకి 78 నుంచి 96, జనసేనకు 16 నుంచి 18, భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 6 అసెంబ్లీ సీట్లు దక్కుతాయని తెలిపింది. కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో బోణీ చేస్తుందని కనీసం రెండు సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. మొత్తం మీద చూస్తే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది. అయితే ఈ సర్వే లెక్కలను ఆప్ నాయకుడు శర్మ పూర్తి స్థాయిలో తప్పు పట్టారు. ఏపీలో ఓటర్ల నాడిని కచ్చితంగా పట్టుకోవడంలో యాక్సిస్ మై ఇండియా విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆయన అసలు ఏపీలో పోలింగ్ వేళ ఏమి జరిగింది అన్నది తన విశ్లేషణ ద్వారా వివరించారు. మే 13వ తేదీ పోలింగ్‌ రోజున సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఓటింగ్‌ జరిగిందని అయన గుర్తు చేశారు. అటువంటి కీలకమైన సమయంలో జరిగిన పోలింగే ఏపీలో వైసీపీకి మరోసారి కచ్చితంగా అధికారాన్ని అప్పగిస్తుందని శర్మ పేర్కొన్నారు. పైగా ఆయన దాన్ని జగన్ వ్యూహంగా అభివర్ణించారు. అలా ఓటర్లు క్యూ లైన్లలో నిలబడి సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఓటు వేశారని అవన్నీ వైసీపీ అనుకూల ఓట్లు అని ఆయన స్పష్టం చేశారు.

మరి అలా ఓటు వేసిన వారి అభిప్రాయాలను సేకరించడం యాక్సిస్ మై ఇండియా విఫలమైందని ఆయన విమర్శించారు. ఏవో కొన్ని అంకెలను తెచ్చి వంటకం చేసి సర్వేల పేరుతో జనాల మీదకు వదలడం అన్నది చేశారని నిందించారు. ఈ సర్వే వరకూ శర్మ తన అభిప్రాయాన్ని పంచుకున్నట్లుగా అనిపించినా అనూహ్యంగా ఆయన జగన్ వ్యూహమని మరోసారి వైసీపీ ఏపీలో అధికారంలోకి వస్తుందని చెప్పడం వెనక ఆప్ మార్క్ ఆలోచనలు ఏమిటి అన్న చర్చ నడుస్తోంది.

ఏపీ ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా దెబ్బ తీసే ప్రయత్నం బీజేపీ చేసింది. దాంతో ఎన్డీయే వైపు జగన్ మొగ్గకుండా ఇండియా కూటమి ఆప్ ని ప్రయోగించిందా అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాలు అంటేనే ఏమైనా జరుగుతాయి కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు.