ఏపీ ఎన్నికల ఫలితాలపై 'ఆరా' మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవే!
ఈ సమయంలో "ఆరా" మస్తాన్ సర్వే ఏపీ ఎన్నికల ఫలితాలపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది.
By: Tupaki Desk | 1 Jun 2024 5:30 PM GMTఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు రెండు రోజుల ముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జూన్ 1 - శనివారం సాయంత్రం 6:30 నిమిషాలకు ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడటంతో ఏపీలో హాట్ హాట్ చర్చలు మొదలయ్యాయి. ఈ సమయంలో "ఆరా" మస్తాన్ సర్వే ఏపీ ఎన్నికల ఫలితాలపై తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది.
అవును... ఏపీలో జరిగిన అసెంబ్లీ – లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఆరా మస్తాన్ సర్వే తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఈ సందర్భంగా వైసీపీ, కూటమి గెలిచే అవకాశం ఉన్న స్థానాలతో పాటు ఓటు షేర్ ని కూడా అంచనా వేసి వెల్లడించింది. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చి ఓటు వేసినవారి విషయంలోనూ సూక్ష్మ పరిశీలకన చేసినట్లు చెబుతున్నారు.
ఈ సందర్భంగా ఏపీలో అధికార వైసీపీ 2 శాతం అటు ఇటుగా 49.41 శాతం ఓట్ షేర్ తో 94 నుంచి 104 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని ఆరా సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది. ఇదే సమయంలో... రెండు శాతం అటు ఇటుగా 47.55 శాతం ఓట్ షేర్ తో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి 71 నుంచి 81 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక లోక్ సభ స్థానాలపైనా తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించింది ఆరా సంస్థ. ఇందులో భాగంగా... రెండు శాతం అటు ఇటుగా 48.29 ఓట్ షేర్ తో 13 నుంచి 15 లోక్ సభ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని... 2 శాతం అటు ఇటుగా 47.68 శాతం ఓట్ షేర్ తో 10 నుంచి 12 సీట్లను కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతరులకు ఒకశాతం అటు ఇటుగా 4.03 శాతం ఓట్ షేర్ వచ్చినా సీట్లు రావని తెలిపింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... కూటమికి పుషులు ఓట్లు ఎక్కువగా పడితే... వైసీపీకి మహిళల మద్దతు అంతకంటే ఎక్కువగా ఉందని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా... కూటమికి 51.56 శాతం పురుషులు ఓట్లు వేయగా.. మహిళలు మాత్రం 42.01 శాతం ఓటు వేశారని ఈ సంస్థ వెల్లడించింది.
ఇదే క్రమంలో వైసీపీకి అనుకూలంగా 45.35 శాతం మంది పురుషులు ఓటు వేయగా.. మహిళలు మాత్రం అత్యధికంగా 54.76 శాతం మంది ఓట్లు వేశారని చెప్పడం గమనార్హం. అంటే... ఈసారి కూడా ఏపీలో అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ఆరా మస్తాన్ సర్వే తన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి వెళ్లడిస్తుంది. ఈ సమయంలో వైసీపీ గెలుపులో మహిళల పాత్రను ప్రధానంగా నొక్కి చెబుతుంది.
కాగా... 2019 ఏపీ ఎన్నికలు, 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరా మస్తాన్ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాట్ పోల్ ఫలితాలకు దాదాపు సమానంగా వచ్చిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... ఈ ఫలితాలపై జనాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ సంస్థ... ఏపీలో మరోసారి వైసీపీ గెలుస్తుందని వెల్లడించింది!