కేకే ప్లేస్‌లో సింఘ్వీ.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం
అయితే, రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన దరిమిలా.. తన కుమార్తెతో పాటు కే. కేశవరావు పార్టీ ఫిరాయించి.. సొంత గూడైన కాంగ్రెస్కు చేరుకున్నారు.
By: Tupaki Desk | 14 Aug 2024 3:19 PM GMTకాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మాజీ రాజ్యసభ సభ్యుడు(ఇటీవలే రాజనామా చేశారు) కే. కేశవరావు స్థానాన్ని రాజస్థాన్‌కు చెందిన సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీకి ఇచ్చేసింది. కే. కేశవరావు.. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు.. ఆయనకు మాజీ సీఎం కేసీఆర్. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. అయితే, రాష్ట్రంలో పార్టీ ఓడిపోయిన దరిమిలా.. తన కుమార్తెతో పాటు కే. కేశవరావు పార్టీ ఫిరాయించి.. సొంత గూడైన కాంగ్రెస్కు చేరుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే.. తిరిగి ఆయనకే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటును ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా రాజస్థాన్‌కు చెందిన సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని ఎంపిక చేసింది. ఈయన గతంలోనూ పశ్చిమ బెంగాల్ నుంచి కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీనికి ముందు రాజస్థాన్ నుంచి కూడా రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన.. ఓడిపోయారు. ఈ నేపథ్యంలో సింఘ్వీని పార్టీ రాజ్యసభకు పంపించనుంది.
ఇక, గెలుపు విషయానికి వస్తే.. సింఘ్వీ గెలుపు నల్లేరుపై నడకే కానుంది. మొత్తం 12 రాజ్యసభ స్తానాలకు సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో బలంగా ఉండడంతోపాటు.. పార్లమెంటులోనూ కాంగ్రెస్‌కు ఒంటరిగానే 99 సీట్లు ఉన్న నేపథ్యంలో సింఘ్వీ ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. కేకే సీటును సింఘ్వీకి ఇవ్వడంతో ఆయనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనేది చూడాది. రాజ్యసభలో ఈ దఫా కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం ఉండడంతోపాటు.. సింఘ్వీ వంటివారి వల్లహిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ పుంజుకుంటుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.