ట్రెండింగ్... ట్రంప్ కు అమెరికా మహిళలు అంత భయపడిపోతున్నారా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 16 Nov 2024 9:18 AM GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈయన గెలుపు అనంతరం అమెరికాకు లోపల, బయటా జరుగుతున్న వివిధ పరిణామాల సంగతి కాసేపు పక్కనపెడితే... ప్రధానంగా అమెరికాలో అబార్షన్ పిల్స్ అమ్మకాలు మాత్రం అమాంతం పెరిగాయని అంటున్నారు.
అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందిన తర్వాత గర్భవిచ్ఛిత్తి ఔషదాల కొనుగోళ్లు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా... గర్భ నిరోధక, గర్భస్రావ మాత్రల కోసం ఇంటర్నెట్ సెర్చ్ 254 శాతం పెరిగినట్లు అబార్షన్ కోసం అవగాహన కల్పించే అమెరికాలోని ‘ప్లాన్-సీ’ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
ఇదే సమయంలో... ట్రంప్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జాతీయ స్థాయిలో అబార్షన్ హక్కులను రద్దు చేసే అవకాశం ఉందన్న భయాందోళనలతో మహిళలు గర్భ నిరోధక మాత్రలను ముందే కొని దాచిపెట్టుకుంటున్నారని, కాపర్ టీ ని అమర్చుకునేందుకు అపాయింట్ మెంట్స్ తీసుకుంటున్నారని స్థానిక పత్రికల్లో కథనాలు వస్తున్నాయి!
ఈ పెరుగుదల ఎంత తీవ్రంగా ఉందనే విషయాలను వెల్లడిస్తూ... ‘ఎయిడ్ యాక్సెస్’ అనే సంస్థ కీలక విషయాలు తెలిపింది. ఇందులో భాగంగా.. సాధారణంగా రోజుకు 600 ఆర్డలూ వస్తుంటాయని.. అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన మర్నాడు ఏకంగా 10,000 ఆర్డర్లు వచ్చాయని చెప్పిందని అంటున్నారు!
ఇక మరో సంస్థ ‘విస్ప్’ స్పందిస్తూ... వైద్యం కోసం రెగ్యులర్ గా తమ వద్దకు వచ్చేవారిలో నవంబర్ 6న అత్యవసర గర్భ నిరోధక మాత్రల కొనుగోళ్లను పరిశీలించినప్పుడు అమ్మకాలు 1,000 శాతం పెరిగాయని.. కొత్త పేషెంట్స్ విషయంలో ఆ అమ్మకాలు 1,650 శాతం పెరిగాయని వెల్లడించినట్లు చెబుతున్నారు.
కాగా... తాను తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే అబార్షన్ హక్కుల మీద ఆంక్షలు విధిస్తానంటూ 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే సమహ్యంలో... గర్భస్రావంపై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాల చేతిలో ఉండాలని అంటూనే.. కొన్ని మినహాయింపులు ఇవ్వాలని అన్నారు.
ఆ సంగతి అలా ఉంటే... జరుగుతున్న పరిణామాలపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగా.. అబార్షన్ హక్కులపై భయాలు చూస్తుంటే.. అమెరికా కొన్ని దశాబ్ధాల వెనక్కి వెళ్లినట్లు అనిపిస్తుందని కొందరంటే.. ఈ భయాలన్నీ ఫార్మా కంపెనీల గిమ్మిక్కులని ఇంకొంతమంది చెబుతున్నారు!