ఐపీఎస్ 'ఏబీవీ' ఒక పాఠమా? మరొక చరిత్రా?!
చంద్రబాబు హయాంలో చంద్రబాబుకు కళ్లూ, చెవులూ.. అన్నీ ఆయనే.
By: Tupaki Desk | 18 May 2024 3:30 PM GMTఏపీకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆలూరి బాల వెంకటేశ్వరరావు(ఏబీవీ) వ్యవహారం.. అనేక కీలక మలుపులు తిరుగుతోంది. 2014-19 మధ్య ఓ వెలుగు వెలిగిన ఏబీవీ.. 2019 తర్వాత.. అంతే ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు.. గత చంద్రబాబు హయాంలో ఎలా అయితే.. ఎంత వేగంగా అయితే ఆయన పేరు తెచ్చుకున్నారో.. వైసీపీ హయాంలో ఆయన అంతే వేగంగా వెనక్కి వెళ్లిపోయారు. అంతే వేగంగా తప్పుకొన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరో 12 రోజుల్లో ఆయన రిటైర్ అవుతున్నారు. మరి ఆయన ఒక పాఠంగా మిగిలిపోతారా.. లేక.. సర్కారుపై గెలిచి చరిత్ర సృష్టిస్తారా? అన్నది ప్రశ్న.
చంద్రబాబు హయాంలో చంద్రబాబుకు కళ్లూ, చెవులూ.. అన్నీ ఆయనే. అలాంటి అధికారి.. వైసీపీ వచ్చిన తర్వాత.. కేవలం రెండు వారాల్లోనే సస్పెండ్ అయ్యా రు. అనంతర కాలంలో అనేక కేసులు చిక్కుకున్నాయి. కుమారుడు పెట్టిన కంపెనీ..(ఇజ్రాయెల్‌తో ఆయుధ వ్యాపారం) సహా పలు కేసులు చుట్టుముట్టాయి. వీటిని ఉద్దేశ పూర్వకంగా పెట్టారన్నది ఏబీవీ వాదన. ఇది నిజమే కావొచ్చు. కానీ.. దీనికి కూడా కారణం ఉంది. అదే `రాజకీయం.`
ఆ రాజకీయ జోక్యమే.. ఏబీవీని ఐదేళ్లుగా అశనిపాతంలో ఉంచింది. కోర్టుల చుట్టూ.. క్యాట్ చుట్టూ తిరిగేలా చేసింది. కానీ, పైకి చెప్పుకోలేక.. అలాగని దిగమింగలేక నానా తిప్పలు పడుతున్నారు. సీఎం జగన్ ఆరోపించినట్టు.. ఆయన చేసిన ఒకే ఒక్క పని.. వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేసేలా.. ప్రోత్సహించడం.. వారి ఆనుపానులు గుర్తించి.. ఆర్థికంగా దెబ్బతీసే చర్యలకు దిగి.. వారిని వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేయించారని సీఎం జగన్ చెప్పారు. ఇలా 23 మంది పార్టీ మారారన్నది జగన్ బహిరంగంగా చెప్పిన మాట.
ఈ విమర్శలను, లేదా వాదనలను..ఏబీవీ ఖండించలేక పోయిన విషయం కూడా చర్చనీయాంశం. దీం తో ఆయన చిక్కుకుపోయారు. తనపై కేసులు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు. కానీ, కొట్టేయలేదు. సస్పెన్షన్ మాత్రమే ఎత్తేయాలని క్యాట్ ఆదేశించి విధుల్లో చేర్చుకోవాలని కోరింది. ఇంతలోనే ప్రభుత్వం ఆయనపై ఉన్న కేసులకు విచారణ జరిపించేందుకు కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. ఇవి రెండు రోజుల కిందటే వచ్చాయి. మరోవైపు క్యాట్ విధుల్లోకి చేర్చుకోవాలన్న ఆదేశాలను కూడా ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
మొత్తంగా ఇవి తేలే వరకు.. ఏబీవీ పరిస్థితి అడకత్తెరలో ఉన్నట్టే. ఇక, ఈలోగానే ఆయన రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. మరో 12 రోజుల్లో ఆయన రిటైర్ కానున్నారు. ఈలోగా ఆయనకు పోస్టింగ్‌దక్కడం సాధ్యం అయ్యే పనికాదని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి ఆయన రిటైర్ అయినా.. కేసుల బెడద మాత్రం తప్పదు. ప్రభుత్వం మారితే పరిస్థితి మారొచ్చేమో.. కానీ, ఇదే ప్రభుత్వం కొనసాగితే.. ఆయన ఒక పాఠంగానే మిగిలిపోతారు.