Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన గనుల తిమింగలం!

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేసింది.

By:  Tupaki Desk   |   27 Sep 2024 6:22 AM GMT
ఎట్టకేలకు ఏసీబీకి చిక్కిన గనుల తిమింగలం!
X

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్‌ గా వ్యవహరించినప్పుడు అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని నమోదైన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెంకటరెడ్డిని అరెస్టు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల శాఖ డైరెక్టర్‌ గా వ్యవహరించినప్పుడు ఇసుక, గనులు, శాండ్‌ మైనింగ్‌ కు సంబంధించి అక్రమంగా అనుమతులు మంజూరు చేయడం, నిబంధనలు పాటించకపోవడం, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీని చెల్లించకపోయినా పట్టించుకోకపోవడం, నిబంధనల ప్రకారం టెండర్లు వేసినవారిని కాదని.. వైసీపీ అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టడం వంటి పలు ఆరోపణలు వెంకటరెడ్డిపై ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంకటరెడ్డిని సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా ఏసీబీ ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో గత మూడు నెలలుగా వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు. తనపై కేసుల భయంతో ఆయన పారిపోయారు. ఆయన కోసం పోలీసులు, ఏసీబీ బృందాలు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గాలించాయి. ఇప్పుడు ఎట్టకేలకు హైదరాబాద్‌ లో వెంకటరెడ్డిని అరెస్టు చేశారు.

ఆయనను విజయవాడకు తీసుకొచ్చిన ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గనులు, ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఎవరికి మేలు జరిగింది? అంతిమ ప్రయోజనాలు ఎవరికి దక్కాయి? ఇందులో ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారనే వివరాలను ఆయన నుంచి తెలుసుకుంటున్నట్టు సమాచారం.

గత ప్రభుత్వ హయాంలో గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరించారు. ఈ క్రమంలో గనుల శాఖ డైరెక్టర్‌ గా ఉన్న వెంకటరెడ్డి ఆయన కనుసన్నల్లో పనిచేస్తూ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని, అనేక అక్రమాలకు పాల్పడ్డారని దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాయల్టీ రూపంలో రూ.2,565 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని వెంకటరెడ్డిపై తీవ్ర అభియోగాలు ఉన్నాయి.

అంతేకాకుండా టెండర్లు/ అగ్రిమెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు, ఆంధ్రప్రదేశ్‌ మినరల్స్, మైనింగ్‌ కార్పొరేషన్‌ నిబంధనలు మీరడం, అక్రమ ఇసుక తవ్వకాలు, ఎన్జీటీ, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకపోవడం, వాటికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించడం వంటివాటిపై ప్రభుత్వం వెంకటరెడ్డిపై ఏసీబీ విచారణకు ఆదేశించింది.

ఇప్పటికే ఏసీబీ.. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ (డీఎంజీ) కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లోని వివిధ మైన్స్‌ అండ్‌ జియాలజీ కార్యాలయాలను సందర్శించి అన్ని జిల్లాల్లోని ఇసుక రీచ్‌లను పరిశీలించాయి. వివిధ డాక్యుమెంట్లను పరిశీలించారు. మైనింగ్‌ అధికారులను ప్రశ్నించి పలు వివరాలు రాబట్టారని తెలుస్తోంది. ఈ క్రమంలో వెంకటరెడ్డి పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్టు సమాచారం.

పర్యావరణ అనుమతులు లేకుండా గనుల లీజులు కేటాయించడం, అనుమతించిన లోతులకు మించి తవ్వకాలు, భారీ యంత్రాలను ఉపయోగించడం వంటి అనేక ఉల్లంఘనలు జరుగుతున్నా వైసీపీ పెద్దలకు వెంకటరెడ్డి కొమ్ముకాశారనే అభియోగాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ప్రాథమిక సాక్ష్యాధారాల ఆధారంగా ఏసీబీ వెంకటరెడ్డిపై కేసు కేసు నమోదు చేసింది. జూలై 31న ఆయనను ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేశారు. ఆయనతోపాటు మరో ఆరుగురిపైన అవినీతి నిరోధక (సవరణ) చట్టం, 2018లోని సంబంధిత సెక్షన్‌ల కింద నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, నేరపూరిత కుట్ర తదితర కేసులు నమోదు చేశారు.