Begin typing your search above and press return to search.

సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు!

వైసీపీ సర్కారులో కీలక పోస్టుల్లో పనిచేసిన ఒక్కో అధికారిపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది.

By:  Tupaki Desk   |   25 Dec 2024 7:35 AM GMT
సమాచార శాఖ మాజీ కమిషనర్ విజయకుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు!
X

వైసీపీ సర్కారులో కీలక పోస్టుల్లో పనిచేసిన ఒక్కో అధికారిపై కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. జూన్ లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ తొలుత ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై కేసు పెట్టింది. ఆ తర్వాత మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఐపీఎస్ అధికారులు సంజయ్, సీతారామంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ ఇలా అఖిల భారత సర్వీసుల్లో పనిచేసిన అధికారులపై రకరకాల కేసులు పెట్టింది. ఇప్పుడు ఈ జాబితాలో సమాచార శాఖ మాజీ కమిషనర్ తమ్మా విజయకుమార్ రెడ్డి చేరారు.

కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్న విజయ్ కుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో డెప్యుటేషన్ పై రాష్ట్రానికి వచ్చారు. ఆయనను కీలకమైన సమాచార శాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టుల్లో ఆయన కీలక బాధ్యతలు నిర్వహించగా, తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరికి అయాచిత లబ్ధి చేకూర్చారని, ఐ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ నియమాకాల్లో నిబంధనలు పాటించలేదని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనల జారీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు చెందిన మీడియా గ్రూపులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే కారణంతో ఓ పత్రికతోపాటు మూడు చానళ్లకు కనీసం రూపాయి కూడా ప్రకటనల కింద ఇవ్వలేదని, పాత బకాయిలు చెల్లించలేదని ఫిర్యాదులు వెళ్లాయి.

ఓ పత్రిక, ఓ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారిని ఐ అండ్ పీఆర్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా నియమించినట్లు విజయ్ కుమార్ రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఏపీ మీడియా ఫెడరేషన్ దిల్లీబాబురెడ్డి ఫిర్యాదుచేయగా, సెప్టెంబర్ 14న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐపీసీ 120బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని 7, 13(2) రెడ్ విత్ 13(1) (ఎ) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.

ఐ అండ్ పీఆర్ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి పక్షపాతంతో వ్యవహరించేవారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్ని మీడియా గ్రూపులకు చెందిన పత్రికలు, చానళ్లకు ప్రకటనలు ఇవ్వొద్దని మౌఖిక ఆదేశాలిచ్చేవారని చెబుతున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం లెక్కచేయకుండా సొంత నిర్ణయాలు తీసుకునేవారని విమర్శలు ఉన్నాయి. ఇక ఒక మీడియా గ్రూపు అడిగిన దానికంటే ఎక్కువగా ప్రకటనల ధర నిర్ణయించి ప్రభుత్వ ఖజానాకు రూ.19.63 కోట్లు నష్టం చేశారని ఏసీబీ కేసు నమోదు చేసింది.